Telangana Assembly: మంత్రుల ప్రశ్నలకు అన్నీ తానై హరీష్‌రావు సమాధానాలు
అప్పులు.. ఆస్తులు, ఆదాయ.. వ్యయాలపై తెలంగాణ అసెంబ్లీ మార్మోగింది. మెరుగ్గా ఉన్న తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రాన్ని గత ప్రభుత్వం తలకిందులు చేసిందంటూ మంత్రులంతా మండిపడ్డారు. ఈ ఆరోపణలకు మాజీ మంత్రి హరీష్ రావు అన్నీ తానై బదులిచ్చారు.
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రుల కామెంట్లివి. శ్వేత పత్రం విడుదల చేసిన మంత్రి భట్టి విక్రమార్క.. ఎన్నో ఆశలతో తెచ్చుకున్న రాష్ట్రంలో.. కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయన్నారు. ఒక్క భట్టి మాత్రమే కాదూ.. మిగతా మంత్రులు కూడా గత ప్రభుత్వం తీరుతో రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన భారీ అప్పులతో రోజువారి ఖర్చులకు కూడా ఆర్బీఐపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉందన్నారు. పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకి అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదన్నారు. ఇలా ఒక్కో మంత్రి ఒక్కో రకంగా గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఆరోగ్య, ఆర్థిక శాఖ, మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుబాటు, రెవెన్యూ లోటుకు సంబంధించి మంత్రులంతా తలోరకంగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. అయితే మంత్రుల ఆరోపణలన్నింటికి మాజీ మంత్రి హరీష్ రావు మాత్రమే సమాధానాలిచ్చారు. ఏ మంత్రి ఏ రంగంపై కామెంట్లు, విమర్శలు చేసినా.. చేసినవన్నీ అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటూ బదులిచ్చారు.
శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విమర్శించారు హరీష్‌రావు. వైట్ పేపర్‌లో ప్రజలు.. ప్రగతి కోణం లేదన్నారు. గతంలో హరీష్ రావు ఆర్థిక, ఆరోగ్య, నీటిపారుదల లాంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. దీంతో సభలో మంత్రుల ఆరోపణలన్నింటికి తానే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఫైనల్‌గా ప్రభుత్వం తరపున మంత్రులు వేర్వేరుగా ప్రశ్నాస్త్రాలు సంధించినా.. సభలో బీఆర్‌ఎస్ నుంచి ఒకే ఒక్కడు బదులివ్వడం కనిపించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..