Fake Certificate: ఒక్క రోజులో బర్త్ సర్టిఫికెట్.. ప్రభుత్వ నిబంధన కాదండోయ్.. అసలు విషయం తెలిస్తే షాక్
మీకు నచ్చిన డేట్ తో బర్త్ సర్టిఫికెట్ (Birth Certificate) కావాలా.. ? అయితే ఇక్కడ ఆ సర్టిఫికెట్ చాలా ఈజీగా లభిస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ధ్రువపత్రం రావాలంటే కనీసం పదిహేను రోజుల సమయం పడుతుంది. కానీ ఒక్క రోజులో...
మీకు నచ్చిన డేట్ తో బర్త్ సర్టిఫికెట్ (Birth Certificate) కావాలా.. ? అయితే ఇక్కడ ఆ సర్టిఫికెట్ చాలా ఈజీగా లభిస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ధ్రువపత్రం రావాలంటే కనీసం పదిహేను రోజుల సమయం పడుతుంది. కానీ ఒక్క రోజులో పని అయిపోవాలంటే డబ్బులు ఖర్చు పెడితే సరి. మీకు నచ్చిన డేట్ తో సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్ల (Fake) ముఠా దందాను ఎస్ఆర్ నగర్ పోలీసులు రట్టు చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవసరం లేకుండానే, రోజుల సమయం పట్టే సర్టిఫికెట్ ను కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఇచ్చేస్తున్నారు. మామూలుగా బర్త్ సర్టిఫికెట్ తయారవ్వాలంటే పదిహేను రోజుల సమయం పడుతుంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మొదటగా హాస్పిటల్ ఛార్జ్ సమ్మరీ మరియు సర్టిఫికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారి డిశ్ఛార్జ్ సమ్మరీ వెరిఫై చేస్తారు. ఆ తర్వాత హెల్త్ అసిస్టెంట్ ఆఫీసర్ అప్రూవల్ చేసే సిటిజన్ సర్వీస్ సెంటర్ నుంచి జీహెచ్ఎంసీ ఆఫీస్ (GHMC Office) కు డేటా వస్తుంది. ఆ డేటా సరిచూసిన తర్వాత జీహెచ్ఎంసీ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ సిస్టంలో అప్ లోడ్ చేస్తారు. దీనికి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డిజిటల్ సిగ్నేచర్ అప్రూవ్ ఇవ్వగానే వెబ్ సైట్ లో అప్లికేషన్ అప్ లోడ్ అవుతోంది. దీన్ని మీసేవ సెంటర్ ద్వారా పొందవచ్చు.
అయితే ఇవేవీ అవసరం లేకుండానే ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించేస్తున్నారు నకిలీ కేటుగాళ్లు. బయట ఏజెంట్లను నియమించుకొని దందా నడిపిస్తున్నారు. ఈ కేసులో ఏజెంట్లుగా ఉన్న ఐదుగురు నిందితులు పట్టుబడగా.. ఏ వన్ గా ఉన్న హెల్త్ అసిస్టెంట్ ఆఫీసర్ అజిజ్ కాసిం, డేటా ఎంట్రీ ఆపరేటర్ అంకిత్ పరారీలో ఉన్నారు. ఒక్కో సర్టిఫికెట్ కు కస్టమర్ల దగ్గర నుంచి రూ.1300 వసూలు చేయగా ఏజెంట్ కమిషన్ 300 తీసుకొని వెయ్యి రూపాయలు అంకిత్ వసూలు చేస్తాడు. ఇందులో 25% కమిషన్ పోగా మిగతాది హెల్త్ అసిస్టెంట్ ఆఫీసర్ జేబులో పడుతుంది. ఇలా ఇప్పటివరకు 163 తప్పుడు సర్టిఫికేట్లు జారీ చేసినట్టు గుర్తించారు. లబ్ధిదారులు ఎవరు..? సర్టిఫికెట్ ఎక్కడ వాడారు..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
– శ్రావణ్, టీవీ9 తెలుగు, హైదరాబాద్