AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కల్తీ ఇంజిన్‌ ఆయిల్‌కి పెద్ద కంపెనీ స్టిక్కర్‌! వామ్మో ఇది మామూలు మోసం కాదు రా స్వామి..! ఎక్కడో తెలుసా..

హైదరాబాద్ పోలీసులు నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీ, అమ్మకాలలో పాల్గొన్న నిందితుడిని అరెస్టు చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ దాడిలో 710 లీటర్ల నకిలీ కాస్ట్రోల్ ఇంజిన్ ఆయిల్, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 3 లక్షలు. నిందితుడు కాస్ట్రోల్ లేబుల్స్‌ను ఉపయోగించి నకిలీ ఆయిల్‌ను తయారు చేసి, తక్కువ ధరకు విక్రయించాడు.

Hyderabad: కల్తీ ఇంజిన్‌ ఆయిల్‌కి పెద్ద కంపెనీ స్టిక్కర్‌! వామ్మో ఇది మామూలు మోసం కాదు రా స్వామి..! ఎక్కడో తెలుసా..
Fake Oil
Noor Mohammed Shaik
| Edited By: Ram Naramaneni|

Updated on: Apr 20, 2025 | 9:59 PM

Share

నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారుచేసి దానికి పెద్ద పేరున్న కంపెనీ పేరు వేసి అక్రమంగా సంపాదిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్, సౌత్ జోన్ టీమ్ మీర్‌చౌక్ పోలీసులతో కలిసి నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 710 లీటర్ల నకిలీ ఇంజిన్ ఆయిల్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దీని మొత్తం విలువ దాదాపు రూ.3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు ఇలా అక్రమంగా సంపాదిస్తూ జనాలకు కల్తీ వస్తువులు అమ్ముతూ మోసం చేస్తున్న ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

కాస్ట్రోల్ యాక్టివ్ ఇంజిన్ ఆయిల్ లేబుల్స్ అతికించి నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీ, అమ్మకంలో పాలుపంచుకున్న షేక్ ఖయ్యూమ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్, సౌత్ జోన్ బృందం మీర్‌చౌక్ పోలీసులతో కలిసి పక్కా సమాచారం మేరకు నకిలీ ఇంజిన్ ఆయిల్ గోడౌన్‌పై దాడి చేశారు. నిందితుడు నూర్ ఖాన్ బజార్‌లోని తన గోడౌన్ నుంచి అక్రమంగా కాస్ట్రోల్ ఇంజిన్ ఆయిల్ లేబుల్స్ అతికించి డూప్లికేట్ ఇంజిన్ ఆయిల్ తయారు చేసి దుకాణాలకు పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తద్వారా అక్రమ రీతిలో సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ఈ మేరకు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అందె శ్రీనివాస రావు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు.

నిందితుడు షేక్ ఖయ్యూమ్ హైదరాబాద్‌లో పుట్టి పెరిగాడు. స్థానికంగా బేగం బజార్ ప్రాంతంలో ఉంటున్నాడు. ఏడో తరగతి వరకు చదువు పూర్తి చేశాడు. మొదట్లో టెంపో వెహికల్ మెకానిక్‌గా పని చేశాడు. తర్వాత అతను నాంపల్లిలోని ఆటోమొబైల్ షాపులో లేబర్‌గా పని చేసి ఆటోమొబైల్ రంగంలో ప్రావీణ్యం సంపాదించాడు. దీంతో పాటు ఖయ్యూమ్ ఆటో కూడా తోలుతూ కొన్నేళ్లు జీవనం సాగించాడు. కానీ అతనికి ఈ సంపాదన సరిపోయేది కాదు. అతని సంపాదన తన కుటుంబాన్ని నడిపించడానికి చాలకపోవడంతో ఎలాగైనా అక్రమ దారిలో డబ్బు సంపాదించాలని, అందుకు మెరుగైన మార్గం ఏంటని ఆలోచించాడు. ఈ క్రమంలోనే మార్కెట్లో డిమాండ్ ఉన్న కాస్ట్రోల్ ఇంజిన్ ఆయిల్ లేబుల్‌లను అతికించి నకిలీ ఇంజిన్ ఆయిల్‌ను విక్రయించాలని ప్లాన్ చేసుకున్నాడు.

దాదాపు 5 నెలల క్రితం అతను నూర్ ఖాన్ వద్ద అద్దెకు ఓ గోడౌన్ తీసుకుని ఇంజిన్ ఆయిల్ వ్యాపారానికి సంబంధించి అన్ని ముడి పదార్థాలను సేకరించాడు. కాస్ట్రోల్ యాక్టివ్ ఇంజిన్ ఆయిల్ లేబుల్‌లు, బార్ కోడ్‌లు మొదలైన వాటిని సరిగ్గా అతికించి నకిలీది అని తెలియకుండా ఎలా వ్యాపారం సాగించాలో తెలుసుకున్నాడు. ఇంజిన్ ఆయిల్‌ను ఉత్పత్తి చేసి మార్కెట్లో కాస్ట్రోల్ ఇంజిన్ ఆయిల్ రేటు రూ.425 ఉండగా.. దాన్ని స్థానికంగా ఉన్న దుకాణాలకు అతి తక్కువ ధర రూ.220కే సరఫరా చేశాడు. ఈ విధంగా అక్రమంగా డబ్బు సంపాదిస్తూ జనాలను బురిడీ కొట్టిస్తూ వ్యాపారం సాగించాడు.

అక్రమ ఇంజిన్ ఆయిల్ అమ్మకాలపై పక్కా సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ మీర్‌చౌక్ పోలీసులతో కలిసి నూర్ ఖాన్ బజార్‌పై దాడి చేసి నిందితుడు షేక్ ఖయ్యూమ్ ను అరెస్టు చేసి, గోడౌన్ నుంచి మొత్తం సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సామాగ్రి 480 లీటర్ల నకిలీ కాస్ట్రోల్ ఇంజిన్ యాక్టివ్ ఆయిల్ కార్టన్లు, ఆరు పసుపు రంగు ఆయిల్ బారెల్స్ 30 లీటర్లు, 340 ఖాళీ పెట్టెలు, 340 కాస్ట్రోల్ యాక్టివ్ లేబుల్స్ స్టిక్కర్లు, 340 కాస్ట్రోల్ యాక్టివ్ క్యాప్స్, 340 కాస్ట్రోల్ బార్‌కోడ్ స్కానర్, ఒక బ్లూ డ్రమ్ కలర్ 50 లీటర్లు, ఒక ఐరన్ బాక్స్, 710 లీటర్ల నకిలీ కాస్ట్రోల్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర, ఎస్ఐలు కె.నర్సిములు, ఎం. మహేష్, జి. ఆంజనేయులు, ఎన్. నవీన్ అండ్‌ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పాటు మీర్‌చౌక్ పోలీసుల పర్యవేక్షణలో ఈ దాడి జరిగింది. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సామాగ్రిని తదుపరి దర్యాప్తు కోసం హైదరాబాద్ మీర్‌చౌక్ పీఎస్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.