Telangana: కాంగ్రెస్ నాయకుల మధ్య టికెట్ వార్.. ఇద్దరు నేతల ప్రచారంతో క్యాడర్‌లో అయోమయం.. పార్టీ అధిష్టానికి తలనొప్పిగా..
Telangana: తెలంగాణలోని ఆ జిల్లా హస్తం పార్టీలో.. టికెట్ల కుమ్ములాట అధిష్టానానికి తలనొప్పిగా మారిందని టాక్. ఇటీవలే పార్టీలో చేరిన ఓ సీనియర్ నేతకు డీసీసీ నుంచి ముప్పు పొంచి ఉందని ఒకటే టాక్. టికెట్టు నాకంటే నాకంటూ సిగపాట్లు పడుతున్నారట ఆ ఇద్దరు నేతలు. ఎవరికి వారే ప్రచార రథాలు, వాల్ రైటింగ్స్ తో క్యాడర్‌లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇంతకీ పీపీసీ మద్దతు ఎవరికి ఉంది.. ఆ డీసీసీ అధ్యక్షుడు ఆరెంజ్ అలెర్ట్ ఎందుకిస్తున్నారు..?
తెలంగాణ, సెప్టెంబర్ 4: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి- ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి మధ్య టికెట్ ఫైట్.. స్ట్రీట్ ఫైట్‌ను తలపిస్తోందట. డీసీసీ అద్యక్షుడు మోహన్ రెడ్డి చాలా రోజులుగా బాల్కొండ సీటు పై కన్నేసి.. గడప గడపకు కాంగ్రెస్ పేరుతో.. ప్రజల్లోకి వెళ్తున్నారు. అక్కడి నుంచి గెలిచిన ఓ మాజీ ఎమ్మెల్యే ఈ సారి తాను పోటీ చేయలేనని చేతులెత్తేశారు. జాగృతిలో కీలక నేతగా ఉన్న ఆరేంజ్ ట్రాపెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేశారు. రెండో స్దానంలో నిలిచారట. ఈ ఎన్నికల్లో బీజేపీలో చేరాలని చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు.. ఓ అగ్రనేత అడ్డు పడటంతో ఆయన బీజేపీలో చేరికకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఆయన కాంగ్రెస్ గూటిలో చేరి.. తానే అభ్యర్దినంటూ ప్రచారం మొదలెట్టేశారు.
సునీల్ రెడ్డి చేరికను డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ముందు నుంచి వ్యతరేకించారు. పీసీసీ నిర్ణయం మేరకు సునీల్ రెడ్డి పార్టీలో చేరిక అనివార్యం కావడంతో.. ఇప్పుడు టికెట్టు కోసం మాత్రం బెట్టు వీడటం లేదట మోహన్ రెడ్డి. డీసీసీ అధ్యక్షునిగా ఉన్న తాను బాల్కొండ బరిలో ఉంటానని అదిష్ఠానానికి సంకేతాలు పంపారు. అదే స్దానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ లో చేరిన సునీల్ రెడ్డి నేను గెలుపు గుర్రాన్ని అంటున్నారు. దీంతో ఇద్దరు నేతలు వేర్వేరుగా కార్యక్రమాలు చేస్తున్నారు. రెండు వర్గాలుగా పార్టీ నేతలు చీలిపోయారట. సై అంటే సై అంటూ పోటీకి రెడీ అవుతున్నారు.
టికేట్ నాదే.. సునీల్ కాంగ్రెస్ లో జూనియర్: డిసిసి అధ్యక్షుడు మానాల
డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి రేవంత్ వర్గంలో ఉన్నారు. ఆయనకు బాల్కొండ టికెట్టు దాదాపుగా ఖరారు అనే సమయానికి.. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి పార్టీలో చేరారు. దీంతో హస్తం పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయు. బాల్కొండ టికెట్టు ను ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి- డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇద్దరు నేతలు టికెట్టు విషయంలో తగ్గేదేలే అంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి ఉంటున్నా.. ఎడముఖం-పెడముఖంలా ఉంటున్నారు. మోహన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఓ సీనియర్ నేత రంగంలోకి దిగినా.. పోటీ చేయడం పక్కా అని చెప్పేశారు. ఇటు సునీల్ రెడ్డి గత ఎన్నికల్లో రెండో స్దానంలో నిలిచానని.. ఈ సారి గెలుపు గుర్రం తానేనని చెబుతున్నారు.
తమ నేతకు టికెట్టు వస్తుందని సునీల్ రెడ్డి వర్గం.. కాదు కాదు మా నాయకుని పక్కా అంటూ మోహన్ రెడ్డి వర్గం చెబుతున్నారు. ఎవరికి వారు ప్రచారం మొదలెట్టేశారు. రెండు వర్గాలుగా పార్టీ చీలీ.. ఇప్పుడు టికెట్టు ఫైట్ చేస్తున్నారు. నేతల టికెట్టు ఫైట్ స్ట్రీట్ ఫైట్ గా మారుతోందని ప్రచారం సాగుతోంది. దీంతో క్యాడర్ లో గందరగోళ పరిస్దితులు నెలకొన్నాయట. ఈ వ్యవహారం పార్టీ అగ్రనేతలకు కొత్త తలనొప్పిగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ. బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఢీకొట్టాలంటే.. కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉండి బలమైన నేతను రంగంలోకి దించితేనే అది సాధ్యం అవుతుందట. కానీ నేతల మధ్య టికెట్ ఫైట్.. అధికార పక్షానికి ప్రయోజనం చేకూరేలా మారింది. నేతల టికెట్టు ఫైట్ పై కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి పరిష్కారం చూపుతారో వేచిచూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..