AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నిన్న నిర్మల్.. నేడు భూపాలపల్లి.. కలకలం రేపుతున్న గుప్త నిధుల తవ్వకాలు.. ఆందోళనలో స్థానికులు..

తెలంగాణలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నారు. రెండు రోజుల క్రితం నిర్మల్ జిల్లాలోని ఓ ఆలయంలో జరిగిన తవ్వకాలను మరిచిపోకముందే భూపాలపల్లి జిల్లాలో మరోసారి గుప్తనిధుల కోసం తవ్వకాలు...

Telangana: నిన్న నిర్మల్.. నేడు భూపాలపల్లి.. కలకలం రేపుతున్న గుప్త నిధుల తవ్వకాలు.. ఆందోళనలో స్థానికులు..
Treasures
Ganesh Mudavath
|

Updated on: Oct 13, 2022 | 7:15 AM

Share

తెలంగాణలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నారు. రెండు రోజుల క్రితం నిర్మల్ జిల్లాలోని ఓ ఆలయంలో జరిగిన తవ్వకాలను మరిచిపోకముందే భూపాలపల్లి జిల్లాలో మరోసారి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం సంచలనంగా మారింది. గణపురం మండల కేంద్రంలోని పురాతన కోటగుళ్లలో గుప్త నిధుల తవ్వకాలు జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ఆలయ ఆవరణలో గుంతను తవ్వడం చర్చనీయాంశమైంది. పూజారి నరేష్‌ రోజేలాగే బుధవారం ఉదయం ఆలయానికి వెళ్తుండగా జమ్మిచెట్టు కింద గుంత కనిపించింది. వెంటనే అప్రమత్తమైన పూజారీ ఆలయ కమిటీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు, క్లూస్ టీం ఘటనాస్థలానికి చేరుకున్నారు. గుంత పక్కనే పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పూజా సామగ్రి ఉన్నాయి. ఈ తవ్వకాలు జరిపింది.. స్థానికులా.. లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేసిన వారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కాకతీయ రాజులు నిర్మించిన ఆలయం కావడంతో గుప్త నిధులు ఉన్నాయనే ఉద్దేశంతోనే తవ్వకాలు జరిపినట్టు తెలుస్తోంది.

కాగా.. గతంలో నిర్మల్‌ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు సంచలనంగా మారింది. పురాతన ఆలయాల్లో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో దుండగులు తవ్వకాలు జరపడం కలకలం రేపింది. కడెం మండలంలో ఉన్న అక్కకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా విశేషమైనది. దిల్దార్‌నగర్, ఎలగడప, సారంగాపూర్‌ గ్రామాలకు చెందిన శివారు ప్రాంతంలో ఈ పురాతన ఆలయం ఉంది. మనుషుల సంచారం తక్కువగా ఉండే ఈ ఆలయం ప్రాంగణంలో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారం ఉంది. దాంతో దుండగుల కన్ను ఈ ఆలయంపై పడింది. ఎలాగైనా నిధిని దక్కించుకోవాలని ప్లాన్‌ వేశారు.

ఇవి కూడా చదవండి

అర్ధ రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఆలయం వెనుక భాగంలో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో గుప్త నిధులు దొరికినట్లు స్థానికులు చెబుతున్నారు. తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించిన గ్రామస్తులకు ఓ పురాతన నాణెం దొరకడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. దీంతో ఈ ఘటన స్థానికంగా పెను సంచలనంగా మారింది.