AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adilabad: బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం.. ఊరురా అలర్ట్

మహారాష్ట్ర తెలంగాణ ప్రాణహిత సరిహద్దులోని‌ కొమురంభీం జిల్లాకు కొత్త ముప్పు‌పొంచి ఉంది. ఇప్పటికే అడవులను‌ గంప గుత్తగా కబ్జా పెట్టిన మహారాష్ట్ర వలస పులులకు తోడు.. ఇప్పుడు మరో వైల్డ్ యానిమల్ గుంపుగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నెల రోజుల క్రితం గుంపు నుండి తప్పిపోయి విధ్వంసం సృష్టించిన మదగజం విధ్వంసం మరువక ముందే బాహుబలి రేంజ్ లో విధ్వంసం ముందుందనే సమాచారంతో ఆ పరిదిలోని అటవిశాఖ అలర్ట్ అయింది.

Adilabad: బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం.. ఊరురా అలర్ట్
Elephants Hulchul
Naresh Gollana
| Edited By: |

Updated on: Apr 23, 2024 | 8:32 PM

Share

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలీ జిల్లా ప్రాణహిత తీరం ఆవల ఏనుగుల మంద సంచరిస్తుందన్న సమాచారంతో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అప్రమత్తమైంది. ప్రాణహిత దాటి ఏ క్షణమైనా ఏనుగుల మంద కొమురంభీం జిల్లాలోకి‌ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయన్న సమాచారంతో అలర్ట్ అయింది. గుంపు‌నుండి తప్పి‌పోయి కాగజ్‌నగర్ కారిడార్ అడవుల్లో‌సంచరించి ఇద్దరు రైతులను పొట్టన పెట్టుకున్న ఏనుగు.. తిరిగి‌ గుంపుగా వచ్చే ప్రమాదం ఉందన్న సమాచారంతో రక్షణ చర్యలకు‌ రెడీ అయింది. జిల్లా అడవుల్లోకి ఏనుగుల మంద వస్తే ఆ సంక్షోభాన్ని ఎలా ఎదురోవాలన్న అంశంపై సోమవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా దూలపల్లి అటవీ అకాడమీలో ప్రత్యేకంగా అటవీశాఖ వర్క్‌షాప్‌ నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అటవీ ముఖ్య అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో అటవీశాఖ సంరక్షణ ప్రధానాధికారి, పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డొబ్రియాల్‌ సిబ్బంది కి‌ అదికారులకు పలు సూచనలు‌సలహాలు‌ చేసినట్టు‌ సమాచారం.

ఏనుగుల మంద తిరిగి రాష్ట్రంలోకి ప్రవేశిస్తే జరిగే సంక్షోభం గురించి వర్క్ షాప్‌లో చర్చించారు అటవి అదికారులు. ఈ‌ సమావేశంలో పాల్గొన్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన రిటైర్డ్‌ సీసీఫ్‌ పీవీ నరసింహారావు ఏనుగుల మందను ఎదుర్కోవడానికి ఆ రాష్ట్రంలో వారు ఉపయోగించిన రక్షణ పద్ధతులను అధికారులకు ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు. వరల్డ్‌ వైల్డ్‌ ఫండ్‌ ఇండియా (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) బోర్డు చైర్మన్‌ అనిల్‌ వీ ఏపూర్‌ ఏనుగుల సంచారం.. గుంపుగా చేసే విద్వంసం పై తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ (వైల్డ్‌లైఫ్‌) ఎంసీ ఫర్గెయిన్‌, పీసీసీఎఫ్‌ (ప్రొటెక్షన్‌-విజిలెన్స్‌) డైరెక్టర్‌ ఈలుసింగ్‌ మేరు, పీసీసీఎఫ్‌ (కంపా) డాక్టర్‌ సువర్ణ, అడిషనల్‌ పీసీసీఎఫ్‌ సునీతా భాగవత్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహారాష్ట్రలో సంచరిస్తూ అక్కడి‌ రైతులను బెంబేలెత్తిస్తోన్న ఏనుగుల గుంపు తెలంగాణలోకి ఏ క్షణమైనా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అదికారుల బృందం తేల్చింది. ఒంటరిగా ప్రాణహిత దాటొచ్చి‌ హల్చల్ చేసిన ఏనుగు.. సింగిల్ గా తిరిగెళ్లి గుంపుగా వచ్చేందుకు సిద్దమవుతున్నట్టు గుర్తించిన‌ ప్రత్యేక‌ అదికారుల బృందం.. వాటి రాకను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ – బెజ్జూర్ అటవీ డివిజన్‌ పరిదిలో అడుగుపెట్టొచ్చని ఫారెస్ట్ అధికారులు బృందం అంచనా వేసింది.

ఏనుగులను నియంత్రించాలంటే.. వాటి కదలికల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టడం అత్యంత కీలకమని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఏనుగుల సంచారం రాత్రిపూటే ఎక్కువ ఉంటుందని.. కనుక రాత్రిపూటా పనిచేసే థర్మల్‌ కెమెరా డ్రోన్లను విరివిగా వినియోగించాలని అటవిశాఖ ఫిక్స్ అయింది. తాజాగా బార్డర్ దాటొచ్చిన‌ ఓ 30 ఏళ్ల మగ మదగజం.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి, పెంచికల్‌పేట , బెజ్జూర్ మండలాల్లో48 గంటలకు పైగా సంచరించి విధ్వంసం సృష్టించి.. ఇద్దరిని పొట్టనపెట్టుకుని వెళ్లిపోయింది. అయితే ఈ ప్రాంతంలో సంచరించిన‌ సమయంలో ఆహార అన్వేషణ చేసిన ఈ మదగజం తిరిగి తన గుంపును ఇక్కడికి తీసుకొచ్చే ప్రమాదం తప్పక ఉందని అంటోంది అటవిశాఖ.

మదగజం సంచరించిన ప్రాంతంలో పచ్చని పంటపొలాలు, చెరుకు , పుచ్చకాయ తోటలు సమృద్ధిగా నీరు ఉండటంతో… ఏనుగులు స్థిరపడేందుకు అనువైన పరిస్థితులు ఇక్కడున్నాయని గుర్తించిన ఆ ఏనుగు తిరిగి తన గుంపును చేరేందుకు తిరుగు పయనమైంది. తాజాగా వారం రోజుల క్రితం తమ గుంపుతో కలిసి ప్రాణహిత వైపు ప్రయాణం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాస్త ఆలస్యమైనా పక్కాగా ఏనుగుల గుంపు కాగజ్ నగర్ కారిడార్ లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అన్న సమాచారం తో ఆ ప్రాంత జనం భయంతో వణికిపోతోంది. ఇప్పటికే ఈ పరిదిలో పదికి పైగా పులులు సంచరిస్తుండగా.. ఏనుగుల గుంపు వస్తే ఇక మనుగడ సాగించడం గగనమే అని భయపడుతున్నారు ఇక్కడి అటవిసమీప గ్రామాల జనం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..