AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్తి తీసుకొని కన్నవారిని గెంటేసిన కొడుకులు..! ఊహించని షాకిచ్చిన తల్లిదండ్రులు

వృద్ధాప్యంలో ఆసరా అవుతారని ఆస్తులను కొడుకుకు రాసిచ్చిన వృద్ధ దంపతులను అతడు నిర్లక్ష్యం చేశాడు. ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో, వారు "తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంరక్షణ చట్టం-2007" ప్రకారం అధికారులను ఆశ్రయించారు. చట్టపరమైన పోరాటం ద్వారా మిర్యాలగూడకు చెందిన ఆ దంపతులు తమ ఇంటిని తిరిగి పొందారు.

ఆస్తి తీసుకొని కన్నవారిని గెంటేసిన కొడుకులు..! ఊహించని షాకిచ్చిన తల్లిదండ్రులు
Miryalaguda Property Case
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 07, 2026 | 11:57 AM

Share

వృద్ధాప్యంలో పిల్లలే భరోసా అనుకున్న ఆ దంపతులు, తమకు ఉన్న ఇల్లు, ఆస్తులను కొడుకు పేరిట బదిలీ చేశారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కొడుకు వారిని నిర్లక్ష్యం చేశాడు. చివరకు ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. నా ఆరోగ్యంతో కంటతడి, నిరాశ, నిస్సహాయతతో వీధిన పడ్డవృద్ద దంపతులు ఏం చేశారో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఇంజం చంద్రకళ, రమణారెడ్డి(70) దంపతులు. వీరికి ఇద్దరూ కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉన్నంతలో వీరిని అల్లారుముద్దుగా పెంచి పెళ్లిళ్లు కూడా చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడెంలో ఉన్న వ్యవసాయ భూమిని కూడా కొడుకులకు పంచి ఇచ్చారు. దీంతో వీరంతా జీవితాల్లో సెటిల్ అయ్యారు. మిర్యాలగూడలో తల్లి చంద్రకళ పేరున ఉన్న ఇంటిలో చిన్న కుమారుడు ఉంటున్నాడు. ముదిమి వయసులో ఆనారోగ్యంతో అల్లాడుతున్న వారిని ఇంటిలోకి రాకుండా ఐదేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నాడు. పంచాయితీలో పెద్ద మనుషులు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో తమకు దిక్కెవ్వరూ లేక, న్యాయం కోసం వృద్ధ దంపతులు అధికారుల తలుపు తట్టారు. అధికారులకు కన్నీళ్లతో తమ గోడును వినిపించారు.

వృద్ధుల ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న అధికారులు “మైంటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ – 2007” ప్రకారం విచారణకు ఆదేశించారు. తల్లిదండ్రుల సంరక్షణపై కౌన్సిలింగ్ కు రావాలని అధికారులు ఆదేశించిన వెంకటరెడ్డి మాత్రం రాలేదు. దీంతో రెవెన్యూ అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు.. ఆస్తి పొందిన తర్వాత వారిని ఇంటి నుంచి వెళ్లగొట్టిన విషయం నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులకు నివేదికలు సమర్పించారు. చట్టంలోని నిబంధనల ప్రకారం.. తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత నిర్వర్తించని పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిని రద్దు చేసే అవకాశం ఉంది. అదే నిబంధనను ఆధారంగా తీసుకుని అధికారులు చర్యలు చేపట్టారు.

వయోవృదుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం తల్లిదండ్రులకు ఇల్లును అప్పగించాలని జిల్లా అధికారులు గత నెల 23న మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డికి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల అమలులో భాగంగా మునిసిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి, సీఐ నాగభూషణం, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ అధికారులు కలిసి వృద్ధ దంపతులకు ఇంటిని అప్పగించారు. దీంతో వృద్ధ దంపతులకు మళ్లీ తమ ఇంటిపై హక్కు లభించింది. ఎన్నో రోజుల తర్వాత సొంత గడపలోకి అడుగుపెట్టిన ఆ తల్లిదండ్రుల కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. ఆస్తి ఇచ్చిన తర్వాత పిల్లలు నిర్లక్ష్యం చేస్తే చట్టపరంగా న్యాయం పొందవచ్చని ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది. “వృద్ధాప్యంలో తల్లిదండ్రులను రోడ్డున పడేయడం కేవలం కుటుంబ సమస్య కాదు.. అది చట్టరీత్యా తప్పు కూడా” అనే సందేశం ఈ కేసు ద్వారా బలంగా వెళ్లింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us