AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jathara: మేడారం భక్తులకు బ్యాడ్‌న్యూస్.. బెల్లం ధరలు ఒకేసారి పెంపు.. కేజీ ఎంతంటే..?

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు షాక్. వ్యాపారులు బెల్లం ధరలను ఒక్కసారిగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సిండికేట్‌గా ఏర్పడి ఉద్దేశపూర్వంగా ధరలను పెంచారు. దీంతో బెల్లం కొనాలంటే భక్తులు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. జాతర ముగిసే వరకు బెల్లం ధరలు ఇలాగే ఉండనున్నాయి.

Medaram Jathara: మేడారం భక్తులకు బ్యాడ్‌న్యూస్.. బెల్లం ధరలు ఒకేసారి పెంపు.. కేజీ ఎంతంటే..?
Medaram Jatara
Venkatrao Lella
|

Updated on: Jan 23, 2026 | 1:51 PM

Share

మేడారం జాతరకు సర్వం సిద్దమైంది. ఈ నెల 28వ తేదీ నుంచి 31 తేదీ వరకు నాలుగు రోజుల పాటు మహా జాతరను అత్యంత వైభవంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు ఇప్పటినుంచే మేడారం వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ సారి దాదాపు కోటి మందికిపైగా భక్తులు జాతరకు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. వచ్చినవారిలో ఎక్కువమంది నిలువెత్తు బెల్లంతో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. దీన్నే బంగారపు మొక్కులు అని పిలుస్తారు. ఎప్పటినుంచో ఈ అనవాయితీ కొనసాగుతూ వస్తోంది.

ప్రతీ ఇంట్లో 10 కిలోల బెల్లం

ఈ క్రమంలో డిమాండ్ కారణంగా బెల్లం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. జాతర క్రమంలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులందరూ సిండికేట్‌గా ఏర్పడి బెల్లం ధరలను ఒక్కసారిగా పెంచారు. దీంతో గ్రామాల్లో బెల్లం కొనాలంటే ధరలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో సామాన్యులపై ధరల భారం పడుతుంది. గ్రామాల్లో వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతూ అందినకాడికి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ ఇంట్లో దాదాపు 10 కిలోల బెల్లంను అమ్మవారికి బంగారపు మొక్కులు చెల్లించేందుకు ఉపయోగిస్తున్నారు. దీంతో గ్రామాల్లోని కిరాణా షాపులు బెల్లం విక్రయాలతో సందడిగా కనిపిస్తున్నాయి. ప్రజల కోసం బెల్లంను భారీ మొత్తంలో స్టాక్‌గా ఉంచుకుంటున్నారు షాపుల యాజమానులు.

కేజీ బెల్లం ఇప్పుడు ఎంతంటే..?

ప్రస్తుతం కేజీ బెల్లం ధర రూ.60 వరకు పలుకుతోంది. మింట్ బెల్లాన్ని రూ.55 వరకు విక్రయిస్తున్నారు. అయితే నెల రోజుల క్రితం బెల్లం ధర రూ.45గా ఉండగా.. ఇప్పుడు రూ.15 మేర పెంచి అమ్ముతున్నారు. జాతర సీజన్ కావడంతో అందినకాడికి సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులందరూ కలిసిపోయి మూకుమ్మడిగా ధరలను పెంచారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి బెల్లంను భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి బెల్లం సరఫరా పెరిగిపోయింది. అలాగే కొంతమంది వ్యాపారులు నాసిరకం బెల్లంను కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బెల్లం విక్రయాలపై అధికారులు నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే బెల్లం ధరల నియంత్రణపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అటు జాతర కోసం ఆర్టీసీ, రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. వరంగల్, కాజీపేటకు రైల్వేశాఖ 28 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అలాగే ఆర్టీసీ 4 వేల ప్రత్యేక బస్సు సర్వీసులను తిప్పనుంది.