Telangana: తెలంగాణ మిర్చి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
ఎర్రబంగారం ధరలు రైతులు తెల్లబోయేలా చేస్తున్నాయి. అమాంతం పడిపోయిన ఎర్ర బంగారం ధరలు చూసి రైతులు తలలు పట్టుకుంటున్నారు.. రెండేళ్ల క్రితం పసిడితో పోటీపడి పరిగెత్తిన ఎర్ర బంగారం ధరలు ఇప్పుడు ఎందుకలా ఢీలా పడిపోయాయి.. ఎర్ర బంగారం ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూడడానికి కారణం ఏంటి.. రైతులు, వ్యాపార వర్గాలు, మార్కెటింగ్ అధికారులు ఏమంటున్నారు.?
రెండేళ్ల క్రితం ఓరుగల్లు మిర్చి చరిత్ర ఖండంతరాలు దాటింది. పసిడి ధరలు క్రాస్ చేసి రికార్డు స్థాయి ధరలు పలకడంతో మిర్చి రైతులు పండగ చేసుకున్నారు. అది గతం.. ఇప్పుడు సీన్ మారింది.. ఎర్ర బంగారం రైతులు తెల్లబోతున్నారు.. అమాంతం తగ్గిన మిర్చి ధరలను చూసి దిగులు చెందుతున్నారు. ఓరుగల్లు మిర్చి అంటేనే సంథింగ్ స్పెషల్.. మిర్చి సాగులో రైతులు పోటీపడుతున్నారు.. కానీ పంట చేతికి వచ్చే సమయానికి అన్నదాతకు మాత్రం ఊహించని షాక్ తగిలింది.. మిర్చి ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి.. ధరలు డమాల్ అనడంతో రైతులు దిగులుతో తలలు పట్టుకున్నారు..
ఉత్తర తెలంగాణ లోని పలు జిల్లాల నుండి వరంగల్ లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు మిర్చి అమ్మకానికి తరలిస్తుంటారు.. ఆసియా ఖండంలోనే ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ అతిపెద్ద మిర్చి యార్డ్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఇక్కడికి దేశ విదేశీ వ్యాపారులు కూడా వచ్చి మిర్చి కొనుగోలు చేస్తుంటారు.. వ్యాపారుల మధ్య పోటీ నెలకొన్న సమయంలో మిర్చి ధరలకు అమాంతర రెక్కలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మిర్చి ధరలు తగ్గిపోవడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1లక్ష 70 వేల ఎకరాలకు పైగా మిర్చి సాగు జరుగుతుంది.. గత రెండేళ్లలో మిర్చి పంటకు ఆశించిన స్థాయిలో ధర లభించాయి.. 2022 సంవత్సరంలో ఓరుగల్లు మిర్చి ధర ప్రపంచ రికార్డు సృష్టించింది.. చపాట మిర్చి ధర ఏకంగా క్వింటాకు 96 వేల రూపాయలు ధరలు పలికి వరల్డ్ రికార్డు సృష్టించింది.
మిర్చి సాగు, ఎగుమతుల్లో వరంగల్ మిర్చి రైతులకు ప్రత్యేకత ఉంది.. ఓరుగల్లు మిర్చి యమా ఘాటు గురు అంటుంటారు.. ఎలాంటి మిర్చికి ఇప్పుడు కనీస గిట్టుబాటు ధరలు లభించక రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు.గత ఏడాది క్వింటా 24 వేల రూపాయల వరకు పలికిన తేజా రకం మిర్చికి ఇప్పుడు 15 వేలకు మించి ధర పలకడం లేదు.. 341 రకం మిర్చి ధర కూడా ఇదేవిధంగా నేల చూపులు చూస్తుంది.. క్వింటా 15,100 రూపాయలు మించి పలకడం లేదు దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు…
మిర్చి ధర లేకపోవడంతో కోల్డ్ స్టోరేజ్ లు నిండుకున్నాయి.. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలు మొత్తం నిండుకొని ఉన్నాయి.. ఎనిమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు చుట్టూ ఉన్న 25 కోల్డ్ స్టోరేజీలో గత ఏడాది నుండి రైతులు మిర్చి స్టోరేజ్ చేసుకున్నారు.. మంచి మద్దతు ధర లబిస్తే మిర్చి అమ్ముకుందామని ఎదురు చూస్తున్నారు.. కానీ సరైన ధర రాకపోవడంతో కోల్డ్ స్టోరేజ్ లోనే మిర్చి మగ్గుతుంది.. ఈ ఏడాది మాత్రం రైతులకు ఎర్ర బంగారం ధర కంట్లో కారం కొట్టినట్లే అయింది..
అయితే అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి కి డిమాండ్ తగ్గడమే ఈ దుస్థితికి కారణమని మార్కెటింగ్ అధికారులు అంటున్నారు.. పైగా ఇక్కడినుండే విదేశాలకు ఎగుమతి అయ్యే మిర్చిలో పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారనే కారణంతో అక్కడి వ్యాపారాలు తిరస్కరిస్తున్నారని, అందువల్ల ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు, అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఎర్రబంగారం రైతులకు ఈ ఏడాది గడ్డు కాలం తప్పేలా లేదు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..