Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అధికారుల ఎగరేసిన 6 డ్రోన్లు ధ్వంసం.. ఏమైందంటే..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార యంత్రాంగం మొదటిసారిగా డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టింది. పోలింగ్ సమయంలో మొత్తం 139 డ్రోన్లు రంగంలోకి దించగా, వాటిలో ఆరు డ్రోన్లు చిక్కుకుని డ్యామేజ్ అయ్యాయి. అవి ఎందుకు ధ్వంసం అయ్యాయో అధికారులు క్లారిటీ ఇచ్చారు .. ..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో అధికారులు కొత్త ప్రయోగానికి పూనుకున్నారు. ఎన్నికల సమయంలో అవకతవకలు జరుగకుండా పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగించారు. నవంబర్ 11న నిర్వహించిన పోలింగ్‌లో మొత్తం 139 డ్రోన్లు రంగంలోకి దించారు. అయితే వాటిలో ఆరు డ్రోన్లు డ్యామేజ్ అయ్యాయి రహ్మత్‌నగర్, కార్మికనగర్‌లలో రెండేసి డ్రోన్లు.. మధురానగర్, షేక్‌పేట్‌లలో ఒక్కో డ్రోన్.. గాలిపటాల మాంజాకు చిక్కుకొని పడిపోయాయి. అయితే డ్రోన్లను కావాలనే కూల్చేశారని కొంతమంది ఆరోపించగా.. మధురానగర్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. డ్రోన్లపై ఎలాంటి దాడి జరగలేదని.. అవి గాలిపటాల మాంజాకు చిక్కుకుని డ్యామేజ్ అయినట్లు వెల్లడించారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు
కాగా ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ. 2.5 లక్షలు వరకు ఉంటుంది. ఈ డ్రోన్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల నుంచి వచ్చిన లైసెన్స్ కలిగిన డ్రోన్ ఆపరేటర్లు నడిపారు. డ్రోన్ల ద్వారా లభించిన విజువల్ ఫీడ్‌ను ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 1,94,631 ఓట్లు పోలయ్యాయి. వీటిలో పురుషులు 99,771, మహిళలు 94,855, ఇతరులు 5 ఓట్లు వేశారు. ఓటింగ్ శాతం 48.49% గా నమోదైంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ లంకల దీపక్ రెడ్డిని బరిలోకి దింపింది. కాగా ఈ ఎన్నికలో ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. గత జూన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.
🚁 For the first time in the country, all polling stations in a constituency are being monitored from the sky using drones@DEO_HYD & @CommissionrGHMC R.V. Karnan inspected polling stations and nearby areas through aerial drone surveillance to ensure smooth and transparent… pic.twitter.com/IOZ8GcDnOQ
— IPRDepartment (@IPRTelangana) November 11, 2025
