MLC Kavitha: చివరి నిమిషంలో కవితకు షాక్.. జంతర్‌మంతర్ వద్ద దీక్షకు అనుమతి రద్దు
మార్చి 10న దిల్లీలో దీక్ష చేస్తామనగానే మార్చి 9న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 11న విచారణకు వస్తానని చెప్పినా 9న రావాలని ఈడీ నోటీసు ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.

చివరి నిమిషంలో కవితకు షాక్ ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. శుక్రవారం జంతర్‌మంతర్ దీక్షకు అనుమతి రద్దు చేశారు. మరో ప్రాంతం చూసుకోవాలని సూచించారు ఢిల్లీ పోలీసులు. శుక్రవారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై ధర్నాకు సిద్ధమయ్యారు కవిత. అనూహ్యంగా ఆఖరు నిమిషంలో అనుమతులు రద్దు చేయడం చర్చనీయాంశమైంది. ప్రెస్‌మీట్‌లో ఇదే అంశంపై అసహనం వ్యక్తం చేశారు కవిత.
అయితే ఢిల్లీ జంతర్‌మంతర్‌లో రేపటి కవిత దీక్షకు ఏర్పాట్లు ప్రస్తుతానికి ఆగాయి. స్థలం విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 5 వేల మంది వస్తారని చెప్పి 10 రోజుల ముందే పర్మిషన్ అడిగినా.. ఆఖర్లో BJP వాళ్లు కూడా ధర్నా చేస్తున్నారంటూ సగం స్థలమే కేటాయిస్తామని ఢిల్లీ పోలీసులు చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో పోలీసులతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు కవిత. రేపు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్ష కొనసాగుతుందన్నారు.
మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగిస్తామని కవిత చెప్పారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలన్నారు. 2014, 2018 ఎన్నికల్లోనూ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చింది కానీ నెరవేర్చలేరన్నారు. 300కు పైగా ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చినా బిల్లు ఆమోదించలేదన్నారు. మహిళా బిల్లుపై నోరు విప్పకుండా.. బీజేపీ బిల్లు అంశాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టిందన్నారు. తమ దీక్షకు విపక్షాలు మద్దతు ఇచ్చాయన్నారు. మార్చి 10న దీక్ష చేస్తామనగానే మార్చి 9న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చిందన్నారు. ధర్నాకు సంబంధించి ముందస్తు కార్యక్రమాల వల్ల 11న వస్తానని చెప్పానన్నారు. 11న వస్తానని చెప్పినా 9న రావాలని ఈడీ నోటీసు ఇచ్చింది అన్నారు.
మహిళలను ఇంటికొచ్చి విచారించాలనే చట్టం చెబుతుందని.. అందుకు విరుద్ధంగా తనను విచారణకు పిలిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని కవిత చెప్పారు. నవంబర్, డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు రావచ్చని.. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానమన్నారు. తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేయడమే బీజేపీ టార్గెట్ అని కవిత ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
