Delhi Liquor Policy Case: కవితకు అవకాశమిస్తుందా..? లేదా..? ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ..
రేపు కాదు ఎల్లుండి ఈడీ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యమేంటని నిలదీసిన కవిత.. ఇందులో రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. మరోవైపు జంతర్‌మంతర్ దగ్గర యధావిధిగా దీక్షకు రెడీ అయ్యారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరుపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతానని ట్వీట్ చేశారు. అంతకుముందు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కి లేఖ రాశారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్లు, వేర్వేరు కార్యక్రమాల కారణంగా ఇవాళ విచారణకు హాజరుకాలేనని లేఖలో రిక్వెస్ట్ చేశారు. కవిత విన్నపానికి ఈడీ అధికారులు స్పందించకపోవడం ఉత్కంఠ రేపుతోంది. అయితే, కవిత అభ్యర్థనకు ఈడీ రియాక్ట్ అవుతుందా..? లేకపోతే జరిగి పరిణామాలేంటీ..? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, రేపటి దీక్ష కోసం కవిత ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే,ఈడీ స్పందన ప్రకారం.. మిగతా వ్యవహారం కొనసాగనుంది.
అయితే, ఈడీ హడావుడిగా దర్యాప్తు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కవిత. స్వల్ప కాలంలో విచారణకు హాజరుకావాలని నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు. దర్యాప్తు పేరుతో చేస్తున్న రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేదేం లేదన్నారు. గతంలో వేర్వేరు కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ.. నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యమేంటన్నారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. వీటన్నింటినీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ఒక సామాజిక కార్యకర్తగా చాలా కార్యక్రమాలు ముందే ఖరారయ్యాయని.. అయినప్పటికీ 11న ఈడీ ఎదుట విచారణకు హాజరవుతానని కవిత లేఖలో స్పష్టం చేశారు.
కేంద్రం బిల్లు తీసుకురావాలని డిమాండ్
ఢిల్లీ వెళ్లిన కవిత.. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా సీఎం కేసీఆర్ అధికార నివాసానికి చేరుకున్నారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలన్న డిమాండ్‌తో రేపు జంతర్‌మంతర్ దగ్గర భారత జాగృతి ఆధ్వర్యంలో కవిత నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రధానంగా ఈ నెల 13 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ దీక్షలో పాల్గొనాలని అన్ని పార్టీలు, సంఘాలకు ఆహ్వానాలు పంపారు. ప్రతి ఒక్కరికి వారి జనాభా ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉప కోటా ఉండాలన్న ఆకాంక్షతో కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు కవిత.




రామచంద్ర పిళ్లై.. కవిత బినామీగా రిపోర్ట్‌లో పేర్కొన్న ఈడీ.. ఇద్దరి మధ్య లావాదేవీలపై ప్రధానంగా ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో.. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
