పెరుగుతున్న కొవిడ్ పేషెంట్ల కోసం బెడ్స్ సిద్ధం చేయాలి..! వైద్యాధికారులను ఆదేశించిన సీఎస్ సోమేశ్ కుమార్..
CS Somesh Kumar : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా
CS Somesh Kumar : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో బెడ్ల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కేసులు పెరిగితే ఉత్పన్నమయ్యే పరిస్ధితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలన్నారు. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ కు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ప్రజలు పాటించేలా నిబంధనల అమలుకు కృషిచేయాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించేలా చూడాలని, కోవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఆక్సీజన్ ను సక్రమంగా వినియోగించి, వృధా ను అరికట్టేలా చైతన్యపరచాలని కోరారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో గత 24గంటల్లో (బుధవారం) కొత్తగా 3,307 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 8 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.38,045 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,788కి చేరింది.
నిన్న కరోనా నుంచి 897 మంది కోలుకున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,08,396కి పెరిగింది. ప్రస్తుతం 27,861 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 18,685 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.22 శాతం ఉండగా.. మరణాల రేటు 0.52 శాతం ఉంది. కాగా.. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 446 నమోదయ్యాయి. మేడ్చెల్ మల్కాజ్‌గిరిలో 314, రంగారెడ్డిలో 277 కేసులు నమోదయ్యాయి.