Congress: సామాజిక సమీకరణాల పరేషాన్.. మల్లు రవి ఎఫెక్ట్ గడ్డం ఫ్యామిలీపై పడుతుందా..?
కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల్లో ఫిట్ అవుతారనుకున్న నేతలు లోక్ సభ ఎన్నికల బరిలో ఉంటామని తేల్చి చెప్పడంతో అభ్యర్థుల ఎంపిక అధిష్ఠానానికి ఒక సవాలుగా మారినట్టు తెలుస్తోంది. ఇక సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలు రెండింటినీ పరిగణలోకి తీసుకుందామని స్క్రీనింగ్ కమిటీ ప్రయత్నిస్తుంటే సెట్ కావడం లేదని సమాచారం.

కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల్లో ఫిట్ అవుతారనుకున్న నేతలు లోక్ సభ ఎన్నికల బరిలో ఉంటామని తేల్చి చెప్పడంతో అభ్యర్థుల ఎంపిక అధిష్ఠానానికి ఒక సవాలుగా మారినట్టు తెలుస్తోంది. ఇక సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలు రెండింటినీ పరిగణలోకి తీసుకుందామని స్క్రీనింగ్ కమిటీ ప్రయత్నిస్తుంటే సెట్ కావడం లేదని సమాచారం. ఒక స్థానంలో ఒకరికి సీటు ఇస్తే అది ఇంకో దగ్గర ఇంకొకరికి ఎఫెక్ట్ పడుతోందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. సామాజిక సమీకరణాలను పక్కాగా పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా రిజర్వుడు స్థానాల విషయంలో ఏ మాత్రం పొరపాటు చేయకుండా చూడాలని కాంగ్రెస్ చూస్తోంది. అయితే ఎస్సీ రిజర్వుడు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. వీటిలో సామాజిక సమీకరణాలను బేస్ చేసుకొని రెండు మాదిగలకు, ఒకటి మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది.
మూడు ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి స్థానాలు ఉన్నాయి. ఇందులో పెద్దపల్లి స్థానాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీకి ఇవ్వాలని భావించారు. గడ్డం వంశీ మాల సామాజిక వర్గం కావడంతో మిగతా రెండు స్థానాలు వరంగల్, నాగర్ కర్నూల్‌లను మాదిగ సామాజిక వర్గాలకు ఇవ్వాలని భావించారు. అందులో భాగంగా నాగర్ కర్నూల్ ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్న మల్లు రవికి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్ట్ కట్టబెట్టారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. మల్లు రవి ఎట్టి పరిస్థితిలో నాగర్ కర్నూల్ బరిలో నిలుస్తానని తెగేసి చెబుతున్నారు. ఏకంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్ట్‌కు రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. తనకి టికెట్ ఇవ్వడానికి తన పదవి అడ్డుగా ఉంటే తన రాజీనామా ఆమోదించి టికెట్ ఇవ్వాల్సిందిగా పార్టీని కోరుతున్నారు. నాగర్ కర్నూల్ సీటు విషయంలో మల్లు రవి గట్టి పట్టు పడుతుండటంతో పరిస్థితులు మారిపోతున్నాయి.
మల్లు రవికి నాగర్ కర్నూల్ సీటు ఇచ్చే పరిస్థితి ఉంటే మిగతా రెండు సీట్లపై దాని ప్రభావం పడనుంది. ఒక టికెట్ మాల సామాజిక వర్గానికి ఇస్తే మిగతా రెండు సీట్లను మాదిగలకి ఇవ్వాల్సి వస్తోంది. పెద్దపల్లి నుండి గడ్డం వంశీని పోటీలో ఉంచాలని అధిష్ఠానం భావించినా మల్లురవికి టికెట్ ఇస్తే పెద్దపల్లి స్థానాన్ని మాదిగలకు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీలో చేరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. వీరే కాకుండా పార్టీకి చెందిన మాదిగ సామాజిక వర్గనేతలు పెర్క శ్యామ్, రామిళ్ల రాధికలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మాదిగ సామాజికవర్గ నేతల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియక పార్టీకి తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.
మరోవైపు గడ్డం ఫ్యామిలో ఇప్పటికే వివేక్ చెన్నూరు నుంచి వారి సోదరుడు వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గడ్డం వివేక్ కుమారుడు వంశీకి టికెట్ విషయంలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి తోడు మల్లు రవి ఎఫెక్ట్‌తో పెద్దపల్లి నుంచి గడ్డం ఫ్యామిలీ అవుట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
మొత్తానికి మల్లు రవి ఎఫెక్ట్ పెద్దపల్లిలో గడ్డం ఫ్యామిలీపై పడుతోంది. ఇక ఈ సమస్యను పార్టీ ఏవిధంగా పరిష్కరిస్తుందో చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…