Telangana: ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్‌లో క్యూ.. ఈసారి రేసులో ఉన్నది ఎవరెవరంటే.?
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతల దృష్టంతా పార్లమెంట్ ఎన్నికలపై పడింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో నేతలు ఫ్యామిలీ టికెట్స్ కోసం ప్రయత్నిస్తున్నారా.? డీసీసీలు పంపిన సీల్డ్ కవర్స్‌లో కూడా కాంగ్రెస్ పెద్దల కుటుంబసభ్యుల పేర్లు ఉన్నాయా.?
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతల దృష్టంతా పార్లమెంట్ ఎన్నికలపై పడింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో నేతలు ఫ్యామిలీ టికెట్స్ కోసం ప్రయత్నిస్తున్నారా.? డీసీసీలు పంపిన సీల్డ్ కవర్స్‌లో కూడా కాంగ్రెస్ పెద్దల కుటుంబసభ్యుల పేర్లు ఉన్నాయా.? ఆ ఎంపీ సీట్లపై ఆశలు పెట్టుకున్న నేతల భవిష్యత్తు ఏంటి.? ఆసక్తికరంగా మారిన నల్లగొండ జిల్లాలోని రాజకీయం.
కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. జిల్లాలో12 స్థానాలకు గానూ 11 స్థానాలను కైవసం చేసుకుని పూర్వవైభవాన్ని చాటుకుంది. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌కు రాజకీయ ఉద్దండులు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి రేవంత్ మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. జిల్లాలోని ఎంపీ సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల నుంచి అధికార కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి భారీగా ఆశావహులు ఆసక్తి చూపిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఆశావహుల పేర్లను సీల్డ్ కవర్‌లో పీసీసీకి పంపారు. నల్గొండతో పోలిస్తే భువనగిరి స్థానానికి భారీ ఎత్తున ఆశావహులు ఉన్నారు. భువనగిరి ఎంపీ స్థానానికి ఒక్క యాదాద్రి జిల్లా డీసీసీ నుంచే ఆరు పేర్లు వెళ్ళాయట. సూర్యాపేట నుంచి మరో నాలుగుపేర్లను పీసీసీకి పంపారట.
సీల్డ్ కవర్‌లో ఎవరి పేర్లు ఉన్నాయంటే.?
నల్గొండ పార్లమెంటు స్థానానికి మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబంలో ఒకరి పేరు, గత ఎన్నికల్లో సూర్యాపేట నుంచి టిక్కెట్ ఆశించిన పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ పేర్లను ఆశావహులుగా పీసీసీకి సీల్డ్ కవర్‌లో పంపారు. భువనగిరి ఎంపీ స్థానానికి.. కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి కొడుకు సర్వోత్తమ్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబానికి చెందిన మరొకరి పేరు, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి కూతురు కీర్తిరెడ్డి, ఆలేరు నియోజకవర్గానికి చెందిన ఎల్లెంల సంజీవరెడ్డితో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, జనగామ జిల్లాలకు చెందిన మరో నలుగురి నాయకుల పేర్లను పీసీసీకి పంపినట్లు సమాచారం. దీనిపై సమగ్ర సమీక్ష జరిపి మూడు పేర్లతో తుది జాబితాను ఏఐసీసీ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)కి నివేదించనున్నారు.
రెడ్డి సామాజిక వర్గానిదే ఆదిపత్యం..
మొదటి నుంచి నల్లగొండ కాంగ్రెస్‌లో రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఒక్కో నాయకుడి ప్రభావంలో కనీసం రెండు నియోజకవర్గాలు ఉంటూ వచ్చాయి. జానారెడ్డికి నాగార్జున సాగర్‌తో పాటు మిర్యాలగూడ, దేవరకొండలపై పట్టు ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్.. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సూర్యాపేటతో పాటు తుంగతుర్తి నియోజకవర్గాల్లో పట్టు సాధించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఆలేరు అసెంబ్లీ స్థానాలపై పట్టు ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం దరఖాస్తులు స్వీకరించినా.. సీనియర్ నాయకులను కాదని అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించే సాహసం పార్టీ చేయలేకపోయింది. తమతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారు ఇక్కడ నేతలు. ఇప్పటికీ అదే పరిస్థితి కనిపిస్తోంది.
ఎంపీ టికెట్లపై బీసీ నేతల ఆశలు..
మరోవైపు ఈ రెండు పార్లమెంట్ల పరిధిలోని 14 అసెంబ్లీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ 12 చోట్ల విజయం సాధించగా.. నల్గొండ పరిధిలో సూర్యాపేట, భువనగిరి పరిధిలో జనగామ అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా ఉండటంతో టిక్కెట్ వస్తే గెలుపు ఖాయమన్న అభిప్రాయం నేతల్లో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఇక్కడి నుంచి పోటీకి పలువురు సీనియర్లు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే డీసీసీలు పంపిన సీల్డ్ కవర్లలో నేతల కుటుంబసభ్యుల పేర్లు ఉండటంతో ఫ్యామిలీ ప్యాక్‌కే పెద్దపీట వేసినట్టుగా కేడర్ భావిస్తోంది. ఇప్పటికే ఈ రెండు స్థానాల నుంచి ఇతర సామాజికవర్గం నేతలు టికెట్లను ఆశిస్తున్నారు. రెండు ఎంపీ టిక్కెట్లలో ఒక స్థానం బీసీ సామాజికవర్గానికి ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ టికెట్లను కూడా కాంగ్రెస్ పెద్దల ఫ్యామిలీకే పెద్ద పీట వేస్తారా.? లేక ఇతర సామాజికవర్గాలకు ఇస్తారా.? అనేది ఆసక్తికరంగా మారింది.