BJP: 3 రోజులు.. 14 సెషన్లు.. ముగిసిన బీజేపీ శిక్షణా తరగతులు.. టార్గెట్-2023 దిశగా కీలక నేతల దిశానిర్దేశం..
టార్గెట్-2023...! TRSను ఎలా ఎదుర్కోవాలి? అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం ఎలా.? ప్రజాక్షేత్రంలో ఏయే కార్యక్రమాలు చేపట్టాలి? ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా జరిగిన BJP మూడు రోజుల శిక్షణాతరగతులు ముగిశాయి..! మరి వాట్ నెక్ట్స్!

3 రోజులు.. 14 సెషన్లు..! కీలక నేతల దిశానిర్దేశం..! రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నుంచి మొదలు పెడితే.. సిట్ విచారణ వరకు ఇలా చాలా అంశాలపై లోతుగా చర్చించింది తెలంగాణ బీజేపీ. శామీర్‌పేటలో జరిగిన పార్టీ శిక్షణా తరగతుల్లో దాదాపు 300 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలపై వారికి అవగాహన కల్పించారు. కేంద్రం నుంచి పలువురు కీలక నేతలు కూడా హాజరయ్యారు. ఒక్కో అంశంపై బీజేపీ నాయకత్వం 45 నుండి గంటకుపైగా ప్రసంగించారు. పార్టీ ఆవిర్భావం, పార్టీ లక్ష్యాలు, ప్రతికూల పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపించడం వంటి అంశాలపై బీజేపీ నాయకత్వం శిక్షణ ఇచ్చింది. ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరారు. వీరందరికి పార్టీ సిద్దాంతాలపై అవగావన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.
అయితే పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మాత్రం రాలేదు. 2023 ఎన్నికల్లో మార్పు తథ్యం అన్న భరోసా పార్టీ శ్రేణులకు కల్పించే ప్రయత్నం చేశారు నేతలు. బీజేపీ నేతలను, పాలనను విమర్శించి ఓట్లు పొందాలని టీఆర్ఎస్ భావిస్తోందని.. ఈ కుట్రలను తిప్పికొట్టాలంటే.. మరింత అగ్రెసివ్‌గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని దిశా నిర్దేశం చేశారు కమలం నేతలు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిందేనన్నారు బండి సంజయ్..!
తీర్మానాలు..
రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భాగంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా…ఎంపీ సోయం బాపూరావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, సోయం బాపూరావు, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీలు నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చాడ శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణంగా బలపరుస్తూ కొన్ని సూచనలు చేశారు.
అధికారంలోకి వచ్చినే తర్వాత ఏం చేస్తామంటే..
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదు. అవసరమైతే వాటని మరింత మెరుగ్గా అమలు చేసి అందరికీ వర్తింపజేస్తాం. గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ హయాంలో అమల్లోనున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం.
పాదయాత్రలో పేర్కొన్నట్లుగా అర్హులందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. నిలువనీడలేక నిరుపేదలందరికీ పక్కా గ్రుహాలు నిర్మించి ఇస్తాం. అకాల వర్షాలవల్ల నష్టపోయిన పంటటకు ఫసల్ బీమా యోజన కింద పరిహారం అందిస్తాం. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వండి. అభివ్రుద్ధి చెందిన తెలంగాణగా మారుస్తాం. ఏ ఆశయం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆశయ సాధన దిశగా పనిచేస్తాం
ట్రైనింగ్ క్లాసెస్ ముగిసిన తర్వాత..
బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. డీకే అరుణ, ఈటల, విజయశాంతి, వివేక్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి హాజరయ్యారు. సిట్ విచారణ , పార్టీలో చేరికలపై చర్చించినట్లు తెలుస్తోంది.. బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శిక్షణా శిబిరాలకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ , డీకే అరుణ, సునీల్ బన్సల్ , ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీలు అరవింద్, సోయం బాబూరావు, ఎమ్మెల్యే రఘునందనరావు తదితరులు హాజరయ్యారు. ఇదిలావుంటే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ఈ నెల చివరి వారంలో బైంసా నుండి ప్రారంభించనున్నారు.
టార్గెట్-2023 రీచ్ అవ్వాలంటే మరింత దూకుడు అవసరమని బీజేపీ సీనియర్లు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది..! ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
