Gaddar Awards: ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది.. కానీ! గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలకృష్ణ, అల్లు అర్జున్, రాజమౌళి వంటి ప్రముఖులు అవార్డులు అందుకున్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని సీఎం ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ను అందజేశారు. ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని సినీ ప్రముఖులకు అవార్డులు అందజేశారు. సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, రాజమౌళి, అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్, విజయ్ దేవరకొండతో పాటు మరికొందరు హాజరయ్యారు. అయితే అవార్డులు అందజేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ.. సినీ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. సినీ పరిశ్రమను గౌరవించుకోవాలన్నదే తమ ఉద్దేశం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
14 ఏళ్ల తర్వాత మళ్లీ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో నంది అవార్డులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. హాలీవుడ్, బాలీవుడ్ కాదు.. ప్రపంచ సినిమా తెలంగాణ గడ్డపై ఉండాలంటే.. ఏం చేయాలో ఏం కావాలో చెప్పండి.. అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి అయ్యాలా తమ వంత సాయం అందిస్తామని అన్నారు. గద్దరన్న అంటే ఒక చైతన్యం, గద్దరన్న అంటే ఒక విప్లవం, గద్దరన్న అంటే ఒక వేగు చుక్క, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణను సాధించుకున్నాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గద్దర్ అవార్డ్స్ అందుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి