CM KCR : మెట్రోకు సహకారం అందిస్తాం.. మరింత సమర్ధవంతంగా నడిపించాలి : సీఎం కేసీఆర్
CM KCR : హైదరాబాద్ మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరింత
CM KCR : హైదరాబాద్ మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరింత సమర్థవంతంగా నడుపుతూ ప్రజలకు సేవలందించాలని ఆకాక్షించారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైలు రవాణా అంశం పై చర్చించేందుకు ప్రగతి భవన్ లో ఎల్ అండ్ టీ సంస్థ సీఈవో & ఎండీ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం సిఎం కెసిఆర్ తో సమావేశమయ్యారు. కరోనా మూలంగా మెట్రో నష్టాల్లో నడుస్తున్నదని, ఈ పరిస్థితుల్లో తమకు సహకారం అందించాలని ఎల్ అండ్ టీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా పలు విషయాలను చర్చించారు.
సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ వారి అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించారు. కరోనా పరిస్థితుల్లో ప్రయాణీకులకు సేవలందిస్తున్న మెట్రోకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. మెట్రో రైలుకు సబంధించి, ఎల్ అండ్ టీ సంస్థకు, ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఏ మేరకు సహాయం చేయవచ్చో పరిశీలించాలని అధికారులకు సిఎం సూచించారు. ఇందుకు సంబంధించి సమీక్ష నిర్వహించి తనకు నివేదికను అందచేయాలని సిఎంవో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. లాక్‌డౌన్ అనంతరం మెట్రో రైలు సేవలను అధికారులు పూర్తి స్ధాయిలో అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 7గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వీసులు నడుపుతున్నారు. మెట్రో సమయాల్లో మార్పులతో నిత్యం లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
కాగా సమావేశంలో హోంశాఖామంత్రి మహమూద్ అలీ, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మెట్రో ఎండీ ఎన్ వి ఎస్ రెడ్డి, సంస్థ డైరెక్టర్ డికె సేన్, ప్రాజెక్టుల సీఈవో అజిత్, హైద్రాబాద్ మెట్రో సీఈవో కెవిబీ రెడ్డి, పాల్గొన్నారు.