రాయి ఏంటో.. రత్నమేదో గుర్తించాలన్న సీఎం.. ఎన్నికల శంఖారావం పూరించిన కేసీఆర్
తెలంగాణలో ఎన్నిక సమరం షురూ అయ్యింది. ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు సీఎం కేసీఆర్. హుస్నాబాద్ బహిరంగసభ వేదికగా ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. 17 రోజుల్లో 42 సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. మేనిఫెస్టో ప్రకటించడంతో ఇక ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. హ్యాట్రిక్ విజయంతో మరోమారు అధికారంలోకి రావాలని చూస్తున్నారు గులాబీ బాస్.

తెలంగాణలో ఎన్నిక సమరం షురూ అయ్యింది. ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు సీఎం కేసీఆర్. హుస్నాబాద్ బహిరంగసభ వేదికగా ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. హుస్నాబాద్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం సీఎం కేసీఆర్‌కు ఆనవాయితీగా వస్తోంది. 17 రోజుల్లో 42 సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. మేనిఫెస్టో ప్రకటించడంతో ఇక ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. హ్యాట్రిక్ విజయంతో మరోమారు అధికారంలోకి రావాలని చూస్తున్నారు గులాబీ బాస్. ముఖ్యంగా పేద వర్గాలతో పాటు రైతులు, మహిళలకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు.
తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచే సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. తెలంగాణకు హుస్నాబాద్ నియోజకవర్గం ఈశాన్య దిక్కుగా ఉంటుంది. అందుకే వాస్తు ప్రకారం ఇది కలిసొచ్చే అంశం కావడంతో తొలి బహిరంగ సభను కేసీఆర్ ఇక్కడే నుంచే షురూ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన అనంతరం.. హెలికాప్టర్‌లో నేరుగా హుస్నాబాద్ చేరుకున్న కేసీఆర్ బహిరంగ సభను ఉద్ధేశించిన ప్రసంగించారు.
హుస్నాబాద్ ఆశీర్వాదంతో 2018లో 88 సీట్లతో ఘనవిజయం సాధించామన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 95నుంచి 105 స్థానాలు గెలవాలన్నారు. ఆ లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలు ఒక్క చాన్స్ అంటూ జనంలోకి వస్తున్నారన్నారు. గతంలో అవకాశమిస్తే ఏం చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. రాయి ఏంటో, రత్నమేదో గుర్తించి ఓటు వేయాలని సూచించారు సీఎం. ఈ సందర్భంగా 2023 ఎన్నికల మేనిఫెస్టో అంశాలను వివరించారు కేసీఆర్.
తెలంగాణలో తొమ్మిదేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి పరిచే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇప్పటికే అన్ని విధాలు ఆదుకున్నామన్న కేసీఆర్..శనిగరం ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. అలాగే వీరభద్ర స్వామి ఆలయాన్ని అభివృధ్ధి చేస్తామని, ఎల్కతుర్తిలో బస్టాండ్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 9 ఏళ్ల క్రితం విద్యుత్ కొరత, సాగునీరు, తాగునీరు లేదు. రాష్ట్రం నుంచి లక్షలాది ప్రజలు వలస వెళ్లేవారు. సమస్యల పరిష్కారానికి కొన్ని నెలల పాటు మేధోమథనం చేశాం. అందరి సహకారంతో రాష్ట్రాన్ని ఎన్నో అంశాల్లో నంబర్ వన్‌గా నిలిపాం. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణకు ఎవరూ సాటి రారన్నారు. ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఇలాగే కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. తప్పుడు మాటలు నమ్మి మోసపోద్దన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
