TS Cabinet Meeting on Lockdown: తెలంగాణలో ఆంక్షల్లేవు.. అన్నీ ఓపెన్‌.. లాక్‌డౌన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

KCR Cabinet Meeting on Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన స‌మావేశ‌మైన రాష్ట్ర కేబినెట్ ఈ మేర‌కు నిర్ణయించింది.

TS Cabinet Meeting on Lockdown: తెలంగాణలో ఆంక్షల్లేవు.. అన్నీ ఓపెన్‌.. లాక్‌డౌన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Cm Kcr

| Edited By: Sanjay Kasula

Jun 20, 2021 | 7:34 AM


KCR Cabinet Meeting on Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ మ‌ధ్యాహ్నం స‌మావేశ‌మైన రాష్ట్ర కేబినెట్ ఈ మేర‌కు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. ఈ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు మంత్రులందరూ ఒకే చెప్పడంతో ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించారు. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.


తెలంగాణలో ‌లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తారా.? లేదా నైట్ కర్ఫ్యూ మాత్రమే విధిస్తారా.? ఆంక్షలు ఎలా ఉండనున్నాయి అన్న దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ శనివారం ప్రగతి భవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో ముఖ్యం రాష్ట్రంలో లాక్‌డౌన్ అంశంతో పాటు ఖరీఫ్ సాగు, వ్యవసాయం, పలు అంశాల గురించి చర్చించారు. వీటితోపాటు గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి, నూతన విద్యా సంవత్సరం ప్రారంభం తదితర విషయాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయత్రం 6గంటల (ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట) వరకు సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమలులో ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 20 నుంచి  అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అన్‌లాక్‌ గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. లాక్‌డౌన్‌కు ముందున్న అన్ని కార్యకలాపాలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

*బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి.
*మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా.
*ఆఫీసులు, దుకాణాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.
*భౌతిక దూరం, శానిటైజేషన్‌ తప్పనిసరి.
*జూలై 1 నుంచి విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు తెరిచేందుకు అనుమతి.
*ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

Telangana Unlock Guidelines

Telangana Unlock Guidelines


LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 19 Jun 2021 10:30 PM (IST)

  తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగంః మంత్రి మండలి

  అయితే సుప్రీం కోర్టులో కేసు కారణంగా తాము సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయలేకపోతున్నామని, తెలంగాణ కేసులను విరమిస్తే గనుక తాము త్వరగా నిర్ణయిస్తామని 6 అక్టోబర్ 2020 న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండవ సమావేశంలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసును విరమించుకుని కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరిస్తదనే నమ్మకంతోనే తెలంగాణ ప్రభుత్వం కేసును ఉపసంహిరించుకున్న నేపథ్యంలో కేంద్రం నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర కేబినెట్ మండిపడింది.

 • 19 Jun 2021 10:27 PM (IST)

  కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కలేదు

  బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడి 17 సంవత్సరాలయినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలయినా.. తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన నీటివాటా నిర్దారణ కాలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం- 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయమని విజ్జప్తి చేసింది.

 • 19 Jun 2021 10:25 PM (IST)

  ఆర్ డిఎస్ నిర్మాణాలపై కేబినెట్ ఆగ్రహం

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను కేబినెట్ తీవ్రంగా నిరసించింది. ఆంద్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందని, సుప్రీంకోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదలశాఖ కేబినెట్‌కు తెలిపింది. ఎన్ జీ టీ తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మంత్రి మండలి మండిపడింది.

 • 19 Jun 2021 07:51 PM (IST)

  తెలంగాణలో అన్‌లాక్‌ గైడ్‌లైన్స్‌ విడుదల

  రాష్ట్రవ్యాప్తంగా జూన్ 20 నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.దీంతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అన్‌లాక్‌ గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. లాక్‌డౌన్‌కు ముందున్న అన్ని కార్యకలాపాలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  *బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి.
  *మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా.
  *ఆఫీసులు, దుకాణాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.
  *భౌతిక దూరం, శానిటైజేషన్‌ తప్పనిసరి.
  *జూలై 1 నుంచి విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు తెరిచేందుకు అనుమతి.
  *ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

 • 19 Jun 2021 07:46 PM (IST)

  వివిధ కులవృత్తులకు నిధుల విడుదలకు ఆమోదం

  వివిధ వృత్తి కులాలకు ఎంబీసీ కర్పోరేషన్ కు నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆదేశించింది. అలాగే, చేనేత మరియు గీత కార్మికులకు త్వరితగతిన బీమా అందించడానికి చర్యలు తీసుకోవాలని, మత్స్య కార్మికులకు, గీత కార్మికులకు అందించాల్సివున్న ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది. రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే, వృత్తి కులాలకు కూడా సత్వరమే బీమా చెల్లింపులు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

 • 19 Jun 2021 07:44 PM (IST)

  గ్రామాల్లో మోడ్రన్ సెలూన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

  క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణులకోసం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

 • 19 Jun 2021 07:43 PM (IST)

  గొర్ల పెంపకం పథకం తిరిగి ప్రారంభం

  గొర్ల పెంపకం వృత్తిలో వున్న యాదవులకు గొర్ల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

 • 19 Jun 2021 07:41 PM (IST)

  రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ

  ముగిసిన సీజన్‌లో పండిన 1.4 కోట్ల వరి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. 1.6 కోట్ల టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొన్నారని మార్కెటింగ్ శాఖ వివరించింది.  ప్రభుత్వ ఆదేశాల మేరకు, కరోనా కష్టకాలంలో కూడ ధాన్యం సేకరణను రికార్డు స్థాయిలో జరిపిన పౌర సరఫరా, గ్రామీణాభివృద్ధి మరియు సంబంధిత శాఖల అధికారులను సిబ్బందిని, కేబినెట్ అభినందించింది.

 • 19 Jun 2021 07:38 PM (IST)

  అత్యధునిక ఆసుపత్రులకు కేబినెట్ ఆమోదం

  చెస్ట్ హాస్పటల్ ప్రాంగణంలో... ఈ మధ్యనే గడ్డి అన్నారం ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో... మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ నుంచి ఓఆర్‌ర్ మధ్యలో.. మొత్తం మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను., టిమ్స్ ను కలిపి నాలుగు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.

 • 19 Jun 2021 07:36 PM (IST)

  జీహెచ్ఎంసీ పరిధిలో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఆమోదం

  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడున్న ‟టిమ్స్” ఆసుపత్రిని ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తూ దాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అధునీకరించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దానికి తోడుగా జంట నగరాల పరిధిలో అదనంగా మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించింది. మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కేబినెట్ మంజూరు చేసింది.

 • 19 Jun 2021 07:26 PM (IST)

  కొత్తపేటలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్

  కొత్తపేటలో ప్రస్తుతం వున్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, కేబినెట్ ఆమోదం తెలిపింది.

 • 19 Jun 2021 07:04 PM (IST)

  పిల్లలకు టీకా పూర్తయ్యాక స్కూల్స్ తెరవండిః భట్టి

  జులై 1 నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తామనడం సరికాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పాఠశాలలను తెరవాలంటే ముందుగా జులై 1 లోపు పిల్లలకు టీకా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పిల్లలకు టీకా పూర్తయ్యాక స్కూల్స్ ఓపెన్ చేయాలన్నారు. పిల్లలకు టీకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం చేయలేకపోయాయని విమర్శించారు.

   

 • 19 Jun 2021 06:32 PM (IST)

  దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనివార్యంః ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌

  దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమని.. అది 6 నుంచి 8 వారాల్లో దేశంపై విరుచుకుపడే అవకాశం ఉందంటున్నారు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా. గులేరియా కామెంట్స్‌ గుబులు రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ మొదలయ్యాక ప్రజల్లో కోవిడ్‌ జాగ్రత్తలు కనిపించడం లేదంటూ బాంబ్ పేల్చారు. ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ మధ్య నిర్లక్ష్యమే కొంపముంచింది. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేశారని మళ్లీ రిలాక్స్‌ అయితే మరో ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే.

 • 19 Jun 2021 06:31 PM (IST)

  ఆదమరిస్తే కరోనాకు అవకాశం !

  లాక్‌డౌన్‌ ఎత్తివేసినా నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రభుత్వం సూచించింది. అయితే, భౌతికదూరం, మాస్క్‌ల వంటి నిబంధనలున్నా.. వాటిని ఎంతవరకు కచ్చితంగా పాటిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. కరోనా మన మధ్యే ఉంది. థర్డ్‌వేవ్‌ హెచ్చరికలతో ఇంకా భయపెడుతూనే ఉంది. ఆంక్షలెత్తేశారని నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదమంటున్నారు నిపుణులు. సెకండ్‌వేవ్‌లో కరోనా కల్లోలం సృష్టించింది. ఇప్పుడిప్పుడే జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ టైంలో ఏమాత్రం ఆదమరిచినా కరోనాకి అవకాశమిచ్చినట్లే.

 • 19 Jun 2021 06:29 PM (IST)

  బస్సులు, మెట్రో సర్వీసులు యథాతథం

  ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు, మెట్రో సర్వీసులు అన్నీ యథాతథంగా పనిచేయబోతున్నాయి. జూలై 1నుంచి తెలంగాణలో విద్యా సంస్థలు కూడా తెరుచుకోబోతున్నాయి.

 • 19 Jun 2021 04:48 PM (IST)

  పాఠశాలలకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు

  విద్యా సంస్థలు పున: ప్రారంభం అవుతున్ననేపథ్యంలో... విద్యార్ధుల తప్పనిసరి హాజరు, ఆన్ లైన్ క్లాసుల కొనసాగింపు, తదితర నిబంధనలు, విధి విధానాలకు సంబంధించిన ఆదేశాలను.. త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది.

 • 19 Jun 2021 03:58 PM (IST)

  నిబంధనలను ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు

  కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించింది కేసీఆర్ సర్కార్. సెకండ్ వేవ్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

 • 19 Jun 2021 03:52 PM (IST)

  కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదుః రాష్ట్ర కేబినెట్

  లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని రాష్ట్ర కేబినెట్ హెచ్చరించింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, సానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు., ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.

 • 19 Jun 2021 03:50 PM (IST)

  సామాన్యుల ఇబ్బందుల దృష్ట్యా...

  లాక్‌డౌన్ కారణంగా ప్రజా జీవనం పూర్తిగా స్తంభించింది. ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో సామాన్యులు కుంటుంబ పోషణ భారంగా మారింది . ఈనేపథ్యంలోనే సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని రాష్ట్ర సర్కార్ కోరింది.

 • 19 Jun 2021 03:47 PM (IST)

  జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

  అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థతతో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది.

 • 19 Jun 2021 03:45 PM (IST)

  రాష్ట్రంలో సంపూర్ణంగా లాక్‌డౌన్ ఎత్తివేత

  ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయత్రం 6గంటల (ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట) వరకు సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమలులో ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 19 వరకు అమల్లో ఉన్న లాక్ డౌన్ ను రేపటినుంచి అంటే జూన్ 20 నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది.

 • 19 Jun 2021 03:43 PM (IST)

  అధికారుల నివేదిక అధారంగా కేబినెట్ నిర్ణయం

  దేశవ్యాప్తంగానే కాకుండా, పక్కరాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి అధికారుందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్దారించింది.

 • 19 Jun 2021 03:31 PM (IST)

  తెలంగాణ‌లో లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం

  తెలంగాణ‌లో లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దిగిరావడంతో పాటు, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని వైద్యాధికారులు నివేదిక ఇచ్చారు. వైద్యశాఖ నివేదికలపై సుదీర్ఘంగా చర్చించిన రాష్ట్ర కేబినెట్.. ఈ మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

 • 19 Jun 2021 03:18 PM (IST)

  సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనపై కేబినెట్ లో చర్చ

  సీఎం కేసీఆర్‌ రేపటి నుంచి (జూన్ 20) జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ అంశం తెలంగాణ కేబినెట్ లో చర్చకు వచ్చింది. సిద్దిపేట, కామారెడ్డిలో సీఎం ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. 21న వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తారు. ఇక 22న తన దత్తత గ్రామం వాసాలమర్రికి వెళ్లనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి.. భవిష్యత్‌లో చేయాల్సిన పనులపై గ్రామస్తులతో సీఎం చర్చించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.

 • 19 Jun 2021 02:55 PM (IST)

  జలవిద్యుదుత్పత్తి, సాగునీరు, ఏపీ నిర్మిస్తోన్న ప్రాజక్టులపై సమీక్ష

  తెలంగాణలో సాగునీటి అంశాలతోపాటు, ఏపీ నిర్మిస్తోన్న ప్రాజెక్టులపైనా తెలంగాణ క్యాబినెట్లో చర్చ జరుగుతోంది. గోదావరి నుంచి నీటి ఎత్తిపోత, జలవిద్యుదుత్పత్తి, కృష్ణాపై ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ కుడికాల్వ నిర్మాణం తదితర అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చకు వస్తున్నాయి.

 • 19 Jun 2021 02:49 PM (IST)

  వర్షాకాలం మొదలు కావడంతో వ్యవసాయ సంబంధిత అంశాలపై కీలక చర్చ

  ప్రగతి భవన్‌లో జరుగుతోన్న రాష్ట్ర మంత్రి మండలి అత్యవసర సమావేశంలో కరోనా పరిస్థితులు, పాజిటివ్ కేసులు, రికవరీ, లాక్‌డౌన్‌ వేళల సడలింపు అంశాలు చర్చిస్తున్నారు. వర్షాకాలం మొదలు కావడంతో తెలంగాణలో వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత అంశాలపైనా మంత్రి మండలి కూలంకషంగా చర్చిస్తోంది.

 • 19 Jun 2021 02:34 PM (IST)

  కరోనా థర్డ్ వేవ్‌‌పై..

  కరోనా థర్డ్ వేవ్‌ గురించి వస్తున్న సమాచారాన్ని కూడా మంత్రివర్గభేటీలో చర్చించి.. లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే..లాక్‌డౌన్ పొడిగిస్తే.. మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

 • 19 Jun 2021 02:23 PM (IST)

  థియేటర్లకు అనుమతి లభించనుందా..?

  జనసాంద్రత ఎక్కువగా ఉండే థియేటర్లు, షూటింగ్‌లకు, పార్కులు, జిమ్‌లకు అనుమతి ఇస్తారా.? మరికొంతకాలం మూసి ఉంచుతారా.? అనేది కేబినేట్ సమావేశంలో తేలనుంది.

 • 19 Jun 2021 02:21 PM (IST)

  లాక్‌డౌన్‌పై నిర్ణయం..

  ఈ భేటీలో ముఖ్యంగా లాక్‌డౌన్‌, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత విషయాలు, సీజనల్‌ అంశాలు, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోత, జలవిద్యుత్‌ ఉత్పత్తి తదితర అంశాలపై చర్చించనున్నారు.

 • 19 Jun 2021 02:17 PM (IST)

  కేబినెట్ మీటింగ్ ప్రారంభం..

  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభమైంది.

Published On - Jun 19,2021 10:30 PM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu