హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన
హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటించారు. బల్కంపేటలో ముంపు ప్రభావిత కాలనీలను ఆకస్మికంగా సందర్శించిన సీఎం.. వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, మునిసిపల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో వర్షాలపై మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటించారు. బల్కంపేటలో ముంపు ప్రభావిత కాలనీలను ఆకస్మికంగా సందర్శించిన సీఎం.. వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, మునిసిపల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోసారి హైదరాబాద్‌పై కుండపోత వాన కురిసే అవకాశముండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్‌లో వర్షాలపై మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు.
అమీర్‌పేట్ డివిజన్ పరిధిలోని బుద్ధనగర్‌లో డ్రైన్ సిస్టమ్‌ను పరిశీలించిన సీఎం, అధికారులకు తగు సూచనలు చేశారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని స్థానికులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే డ్రైనేజీ సిస్టమ్‌ను స్ట్రీమ్ లైన్ చేసి, వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు. పక్కనే ఉన్న గంగూబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చి వేసి పార్కింగ్‌కు వినియోగిస్తున్నారని సీఎంకు పిర్యాదు చేశారు స్థానికులు. గంగూబాయి కుంట ప్రాంతాన్ని సందర్శించిన సీఎం, తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వరద నీటిని నుంచి విముక్తి కలిగించేందుకు ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవల వరద నీరు నిలిచిపోయిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
ఇదిలావుంటే, మూడురోజులుగా హైదరాబాద్‌లో వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. నగర వాసులు మరోసారి కుండపోతకు సిద్ధం కావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మాదాపూర్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి సహా పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు వాతావరణం కాస్త పొడిగా ఉన్నా రాత్రి వరకు వాన దంచికొడుతుందని అధికారులు చెబుతున్నారు. అకస్మాత్తుగా వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉందని, బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, వర్షం కురిసే సమయంలో భారీ హోర్డింగ్‌లు, చెట్ల కింద నిలబడొద్దని అధికారులు అలెర్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిలిచిపోయే ప్రాంతాలను ముందుగానే తప్పించుకోవాలని, వాహనాలు తక్కువ లోతైన రోడ్లలో మాత్రమే నడపాలని జాగ్రత్తలు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



