ప్రజాసేవ చేయడానికి పదవులు అవసరం లేదు.. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి తీరుతాంః రేవంత్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నారాయణ పేట జిల్లా కోస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో ప్రజాపాలన కొత్త పథకాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామ లబ్దిదారులకు రైతు భరోసా,ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులను ముఖ్యమంత్రి అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సహా ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

రేవంత్ సర్కార్ ప్రజా పాలనలో మరో ముందడుగు పడింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నారాయణ పేట జిల్లా కోస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో ప్రజాపాలన నాలుగు కొత్త పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్తరేషన్‌కార్డుల పంపిణీ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు సీఎం రేవంత్.
మొత్తం 734 మందికి రైతు భరోసా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.11.80 కోట్ల విలువైన చెక్కులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పేదలకు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో 40 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులను ప్రజల దగ్గరకు పంపిస్తుంటే కొందరు చిల్లర పంచాయితీలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఈ విషయాలను ప్రజలు గ్రహించాలని గుర్తు చేశారు.
ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి చర్చించని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ను ఏమనాలని అన్నారు సీఎం రేవంత్. ఆయనకు ప్రజల పట్ల బాధ్యత లేదా అని ప్రశ్నించారు. గత పదేళ్ళలో రాష్ట్ర ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్న సీఎం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనను అమలు చేసి తీరుతామన్నారు. ఎంతోమంది పేదలు కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతు కూలీలు ప్రభుత్వ అండ కోరుకుంటున్నారు. పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు సీఎం. భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం.. రైతుకు కాంగ్రెస్‌కూ మధ్య ఉందన్న సీఎం. రైతులకు ఉచిత కరెంట్‌ను ఇచ్చే పథకాన్ని మొదట అమలు చేసిందన్నారు. అప్పట్లో ప్రధాని మన్మోహన్‌సింగ్ ఒక్క సంతకంతో దేశమంతా రుణమాఫీ చేశారు. ఇప్పుడు రైతులకు ఒకే విడతలో రూ.2లక్షల వరకూ రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.
తాను రాష్ట్రం నలుమూలలు తిరిగినా.. కొడంగల్ ప్రజలకు అండగా తన సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటారన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ కుటుంబసభ్యుల్లా తమకు పదవులు అవసరం లేదన్నారు. పదవులు లేకపోయినా.. తాము ప్రజలకు సేవ చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన నాలుగు కొత్త పథకాలకు సంబంధించిన కార్యక్రమం మార్చి 31వరకు కొనసాగుతుందని సీఎం రేవంత్ తెలిపారు. అర్హులైన వాళ్లందరికీ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..