Telangana: తెలంగాణలో లక్ష రేషన్ కార్డులు రద్దు చేసిన కేంద్రం.. ఎందుకంటే..?
తెలంగాణలో రేషన్ కార్డుల దుర్వినియోగం పెరగడంతో గత 10 నెలల్లో 1.4 లక్షలకు పైగా కార్డులు రద్దయ్యాయి. ఆర్థికంగా స్థిరపడినవారు కూడా పథకాల లబ్ధి కోసం కార్డులు పొందడం దీనికి కారణం. మరోవైపు రేషన్ షాపులన్నీ ఆహార భద్రత చట్టం కింద FSSAI లైసెన్స్ పొందడం తప్పనిసరి. నాణ్యత, పరిశుభ్రత పాటించని షాపులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

రేషన్ కార్డు..పేదవారికి ఆహార భద్రత, కీలక పథకాలకు అర్హులుగా నిర్ధారించే కార్డు..కానీ కాల క్రమేణా రేషన్ కార్డు దుర్వినియోగం అవుతుంది.. ఆర్థిక పరిస్థితి బాగున్నా సరే వివిధ పథకాల్లో లబ్ది పొందడం కోసం అనేక మంది రేషన్ కార్డులు తీసుకుంటున్నారు. అధికారులు లంచాలు తీసుకుని రేషన్ కార్డులు అడిగిన వారికల్లా ఇస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన 10 నెలల్లో తెలంగాణలో 1,40,947 రేషన్ కార్డుల రద్దు చేసింది కేంద్రం. 2020 నుంచి పోల్చితే ఈ ఏడాదే అత్యధికంగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.. బుధవారం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి సహా ఇతర ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2020లో 12,54, 2022లో 4,988, 2023లో 34,064, 2024లో 3,424, 2025లో (అక్టోబర్ వరకు) 1,40,947 రేషన్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్రమంత్రి లోక్‌సభలో తెలిపారు. అయితే ఈ రేషన్ కార్డుల తొలగింపుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వెల్లడించారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 56,60,367 రేషన్ కార్డులు అమలులో ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు.
రేషన్ షాపులకు రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్..
ఆహార భద్రత చట్టం 2006 ప్రకారం రేషన్ షాపులు కూడా ఆహార వ్యాపార కార్యకలాపాల పరిధిలోకే వస్తాయని, అర్హతను బట్టి ప్రతి షాపు యజమాని రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ తీసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. బుధవారం లోక్ సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బి.ఎల్.వర్మ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రేషన్ షాపులు నడపాలంటే భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) లైసెన్స్ తప్పనిసరి అని తేల్చి చెప్పారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రేషన్ షాపుల్లో పరిశుభ్రత పాటించాల్సిందేనని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు, శాంపిల్స్ సేకరిస్తారని, నాణ్యత లోపిస్తే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 38 రకాల నిత్యావసర ఆహార వస్తువుల ధరలను 575 కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. మొబైల్ యాప్ ద్వారా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
