Kishan Reddy: అలా చేస్తే సహించేది లేదు.. రేవంత్ మూసీ పాదయాత్రపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
మూసీ ప్రక్షాళనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లాలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన నేపథ్యంలో మూసీ సుందరీకరణపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
ఈ నేపథ్యంలో మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనని.. నల్గొండ రైతులకు శుద్ధి నీళ్ళు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.అందుకు బీజేపీ కార్యకర్తలు కరసేవ చేసేందుకు సైతం సిద్ధమని ప్రకటించారు. అయితే హైదరాబాదులో ఏ ఒక్క ఇల్లు కూలగొట్టిన సహించేది లేదని.. ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు.మూసీ శుద్ది చేసేందుకు రేవంత్ సర్కారుకు కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. మొదట ప్రస్తుత మూసీకి రీటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని చెప్పారు. తర్వాత సిటీలోని డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి శుద్ధినీరు మాత్రమే మూసీలోకి వదిలేలా చేయాలని సూచనలు చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ళ కూల్చివేతకు వ్యతిరేకంగా మూసీ నిద్ర చేస్తామంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. ఒక రోజంతా మూసీ పరివాహక బాధితుల ఇంట్లో అక్కడే ఉంటూ.. అక్కడే తింటాం అక్కడే పడుకుంటామంటూ ఆయన చెప్పారు. కృష్ణ గోదావరి నీళ్లను తీసుకొచ్చి మూసీలో కలిపిన అభ్యంతరం లేదని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లను కూలగొట్టకుండా మురికి మూసీ శుద్ధి చేసే ప్రయత్నాలు చేయాలంటూ ప్రభుత్వానికి సూచించారు.
తాజాగా ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కూడా కిషన్ రెడ్డి మాట్లాడారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని.. 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.తన డీఎన్ఏపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. తెలంగాణ ప్రజలకు తన డీఎన్ఏ ఏంటో తెలుసు అని.. ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇక రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని పార్టీ గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎన్నిక ఉండబోతుందంటూ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎల్లుండి బీజేపీ బృందాలు సందర్శిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండిటిని ఖతం చేసి తెలంగాణలో త్వరలోనే బీజేపీ పాగ వేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.