
తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా మిగిలిన చోట పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం పోలింగ్ స్క్రూటినీ ముగిసిన తరువాత 71 శాతం నమోదు అయినట్లు ప్రకటించారు సీఈవో. 2018తో పోలిస్తే రెండు శాతం ఓటింగ్ తగ్గిందని, అర్బన్ ఓటు శాతం తగ్గడానికి పోస్ట్ మార్టం చేస్తామని ప్రకటించారు వికాస్ రాజ్.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒకే ఫేజ్‌లో 119 సెగ్మెంట్లలో పోలింగ్ నిర్వహించిన ఈసీ.. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా ఎక్కడా పెద్దగా సమస్యలు తలేత్తలేదు. అత్యధికంగా భువనగిరి జిల్లాలో 90శాతం పోలింగ్ నమోదు కాగా రెండవ స్థానంలో నల్గొండ 85 శాతం, 84శాతంతో సూర్యాపేట మూడో స్థానంలో ఉంది.
అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 46శాతం, మేడ్చల్ 56, రంగారెడ్డిలో 59శాతం ఓటింగ్ మాత్రమే నమోదు అయింది. అత్యధికంగా మునుగోడు సెగ్మెంట్లో 91 శాతం నమోదు కాగా అత్యల్పంగా యాకుత్‌పురాలో 39శాతం నమోదు అయినట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఓటు శాతం పెంచేందుకు ఎలక్షన్ ఏడాది నుంచి అంతర్గంగా పలు ప్రయత్నాలు మొదలు పెట్టింది ఈసీ. అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసారి అనేక వినూత్న, ప్రత్యేక ప్రయత్నాలు చేసింది. అర్బన్‌లో ఉండే యువతతో పాటు టెక్కీలను పోలింగ్ బూత్‌కు రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. అతి ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 15 సెగ్మెంట్లలో గతంతో పోల్చితే ఓటు శాతం తగ్గింది. 2018లో 49శాతం ఉంటే ఇప్పుడు 47శాతం నమోదు అయింది. అంటే రెండు శాతం తగ్గింది.
రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ పోలింగ్ పెరుగుతుందని, పెంచాలని ఈసీఐ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పుడు అర్బన్ ఓటింగ్ ఆశించినంత మేరకు రాలేదు. దీనిపై పోస్ట్ మార్టం నిర్వహిస్తామని ప్రకటించింది ఈసీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..