AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjunasagar: కేంద్ర హోంశాఖ జోక్యంతో సద్దుమణిగిన సాగర్‌ వివాదం

ఏపీ, తెలంగాణ మధ్య నీటిలో నిప్పు రాజేసిన..నాగార్జునసాగర్ వివాదంపై కేంద్రం జోక్యంతో ఎట్టకేలకూ వివాదం ముగిసింది. కేంద్రం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి. డ్యామ్‌ నిర్వహణ KRMBకు అప్పగించడంతో పాటు CRPF బలగాలతో పర్యవేక్షించాలని కేంద్రహోంశాఖ ఆదేశించింది. మరోవైపు శనివారం కృష్ణా జలాల వివాదంపై కేంద్రం కీలక సమావేశం ఏర్పాటు చేసింది.

Nagarjunasagar: కేంద్ర హోంశాఖ జోక్యంతో సద్దుమణిగిన సాగర్‌ వివాదం
Nagarjuna Sagar Dam
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 01, 2023 | 9:53 PM

నాగార్జునసాగర్‌ నీటి విడుదల కోసం ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా వర్చువల్‌గా మాట్లాడారు. సాగర్‌ జలాల విడుదల విషయంలో నవంబరు 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగిస్తూ, డ్యామ్‌ నిర్వహణను KRMBకి అప్పగించడంతో పాటు CRPF దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించడంతో జల వివాదం సద్దుమణిగింది.

అంతకు ముందు సాగర్‌ డ్యాం దగ్గర ఏపీ పోలీసుల హడావిడి, నీటి విడుదలపై KRMBకి తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన KRMB సాగర్‌ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఆదేశించింది. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగి వివాదానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టింది. రాష్ట్రం మొత్తం ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ సర్కార్‌ చేసిన చర్య శాంతి భద్రతల సమస్యను సృష్టించిందని తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

మరోవైపు గురువారం ఉదయం నుంచి సాగర్‌ డ్యాం దగ్గర ఉద్రిక్తత కొనసాగింది. 13 గేట్లు ఏపీ సర్కార్‌ స్వాధీనం చేసుకోవడంతో తెలంగాణ పోలీసులు విజయపురి పీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఏపీ పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఏపీ ఇరిగేషన్‌శాఖ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు.

ఏపీ విభజనతో నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం రాజుకుంది.ఈ ప్రాజెక్టు నిర్వహణను KRMB తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఏపీ అధికారులు మాత్రం తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తోందని..తమ నీటి వాటా ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. అందుకే పోలీసుల సాయంతో సాగర్‌లో నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించామని చెబుతోంది. మొత్తంమీదా ఈ వివాదానికి ఫుల్‌స్టాఫ్‌ పడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..