Telangana: దూకుడును మరింత పెంచేందుకు గులాబీ బాస్ కసరత్తు.. కొత్త కమిటీలపైనే ఫోకస్..
గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకటి రెండు సార్లు తప్ప పెద్దగా బయటకు రాలేదు. పార్టీ సమావేశాలు ఉన్నా, ముఖ్య నేతలు తనని కలవాలన్నా ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే వారితో సమావేశమైయ్యారు. ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి చురుగ్గానే ఆ పాత్రను పోషిస్తుంది. ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకుంటూ దూకుడుగానే ముందుకు వెళ్తుంది. ఈ దూకుడును మరింత పెంచేందుకు కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్‌లో కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కనీసం కొత్త కమిటీల్లో అయినా పార్టీ పదవుల్లో అవకాశం కల్పించాలని నేతలు గులాబీ బాసును కోరుతున్నారు. అసలు రాష్ట్ర స్థాయి కమిటీపైనే ఇప్పటివరకు స్పష్టత లేదు. జిల్లా ఇంఛార్జ్‌లుగా కొందరు నాయకులు తమకు తామే ప్రకటించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో పార్టీని పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. యువతకు కొత్తవారికి పదవులు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
మరోవైపు ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జ్‌లను ఇంకా నియమించలేదు. స్టేషన్ ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్ని తానై చేసుకుంటున్నాడు. రాజేందర్ నగర్‌లో బీఆర్ఎస్ నాయకుడు కార్తీక్ రెడ్డి పార్టీ మొత్తాన్ని సమన్వయం చేస్తున్నాడు. కానీ వీరిని అధికారికంగా నియోజకవర్గ ఇంఛార్జ్ అంటూ ఇప్పటివరకే ప్రకటించలేదు. వీటితోపాటు భద్రాచలం, బాన్సువాడ, చేవెళ్ల, జగిత్యాల, గద్వాల, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో కూడా ఇంఛార్జ్‌లను నియమించాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లే సమర్థవంతమైన నేతలను ఈ నియోజకవర్గాల్లో రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తుంది.
పార్టీలో ఒకవైపు కేటీఆర్ మరోవైపు హరీష్ రావు కార్యకర్తలను కోఆర్డినేట్ చేస్తూ.. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. వీరికి తోడు యువ రక్తంతో నిండిన రాష్ట్ర కమిటీని, జిల్లాల్లో అందరినీ సమన్వయం చేసుకోగలిగే సీనియర్లని నియమించి పార్టీకి కొత్త జోష్ నింపనున్నారు. అనుబంధ సంఘాలకు కొత్త కమిటీలను ఏర్పాటు చేసి ప్రజా పోరాటాల్లో మరింత స్పీడ్ పెంచాలని కేసీఆర్ వ్యూహం రచిస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తుంది. కొత్త ఏడాదిలోపు కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.