4 ఏళ్లలో ఎయిర్ పోర్టుకు మెట్రో !! రెండో దశకు మరో ముందడుగు
ఎట్టకేలకు హైదరాబాద్ మహానగరంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు మరో అడుగు ముందుకు పడింది. నగరం విస్తరిస్తున్న కొద్ది ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీంతో మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు అనుమతి లభించింది.
ఈ మేరకు ప్రభుత్వం జీవో 196ని జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం రెండో దశ మెట్రో బడ్జెట్ 24వేల 269 కోట్లు, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 7వేల313 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా 4వేల230 కోట్లు. ఇవి కాకుండా వివిధ బ్యాంకుల సాయంతో మరో 11వేల 693 కోట్లు, పీపీపీ పద్దతిలో ఒక వెయ్యి 33 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. మెట్రో రైల్ రెండో దశలో పార్ట్-ఏ ఐదు కారిడార్లు విభజించింది. కారిడార్-4లో నాగోలు-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, కారిడార్-5లో రాయదుర్గం-కోకాపేట్, కారిడార్-6లో ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట, కారిడార్-7లో మియాపూర్-పటాన్‌చెరు, కారిడార్-8లో ఎల్బీనగర్-హయత్‌నగర్, కారిడార్ 9లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్-ఫ్యూచర్ సిటీగా విభజించారు. భాగ్య నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రో రెండో దశ అనివార్యంగా మారింది. మొదటి దశలో మూడు కారిడార్‌లలో మెట్రో పరుగులు తీస్తోంది. నిత్యం సుమారు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. రెండో దశ పూర్తయితే 8 లక్షల మంది మెట్రోల్లో పయనించే అవకాశం ఉంది. కేంద్రం సకాలంలో అనుమతించి నిధులు కేటాయిస్తే 2029 నాటికి రెండో దశ పూర్తయ్యే అవకాశం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేరుకే మారుమూల పల్లె !! ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే
ప్రతిరోజూ ఉప్పు నీరు తాగితే.. ఊహించలేని లాభాలు !!