GHMC: ఇందిరా క్యాంటీన్లలో ఇకపై పొద్దున టిఫిన్స్.. పగలు భోజనం… రూ.5కే ప్లేట్ అల్పాహారం
గ్రేటర్ హైదరాబాద్‌లో పేదల ఆకలి తీరుస్తున్న ఐదురూపాయల భోజన కేంద్రాల్లో ఇక నుంచి ఉదయం అల్పాహారం, మిల్లెట్ టిఫిన్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. ఈ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా...

గ్రేటర్ హైదరాబాద్‌లో పేదల ఆకలి తీరుస్తున్న ఐదురూపాయల భోజన కేంద్రాల్లో ఇక నుంచి ఉదయం అల్పాహారం, మిల్లెట్ టిఫిన్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. ఈ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా అందించనున్నారు. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం మాత్రమే అందిస్తుండగా.. దాంతో పాటు ఉదయం పూట టిఫిన్స్ అందించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. క్యాంటీన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రతి క్యాంటీన్ లో కూర్చొని తినే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
నగరంలోని నిరు పేదలకు తక్కువ ధరలో భోజనం అందుబాటులో ఉండేలా 2013లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రూ.5 భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించి క్రమంగా నగరమంతా విస్తరింపజేశారు. రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, అడ్డాకూలీలు ఉండే ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నగరంలో 150 కేంద్రాల్లో ప్రతీ రోజూ సుమారు సుమారు 30వేల మంది భోజనం చేస్తున్నారు. రూ.5 భోజనంలో 400 గ్రాముల రైస్, సాంబారు 120 గ్రాములు, సబ్జీ 100గ్రాములు, పికిల్ 15గ్రామలు అందిస్తున్నారు. ఒక్కో భోజనానికి రూ.27.63 ఖర్చు చేస్తున్నారు. దీనిలో రూ.5 లబ్దిదారులు చెల్లిస్తుండగా మిగిలిన రూ.24.83లను జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. ఈ పథకానికి ప్రతీ ఏటా జీహెచ్ఎంసీ సుమారు రూ. 15 కోట్లు ఖర్చు చేస్తోంది.
అయితే ఇటీవల మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన GHMC 4వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరా క్యాంటీన్లలో ఇక నుంచి టిఫిన్స్, మిల్లెట్ టిఫిన్స్ కూడా అందించనున్నారు. ఉదయం టిఫిన్లలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, మైసూర్ బజ్జీ, పూరీలు, పొంగల్ వంటిని అందించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. టిఫిన్‌ను కూడా ప్రజలకు రూ.5లకే అందించాలని బల్దియా నిర్ణయించింది. ప్రతి ఇందిరా క్యాంటీన్ కు నల్లా కనెక్షన్, కరెంట్, డ్రెయినేజీ కనెక్షన్లను సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.




