Telangana Election: ఇలా చేరారు.. అలా టికెట్ తీసుకున్నారు.. పంతం నెగ్గించుకున్న పలువురు బీజేపీ నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మూడో విడుతలో 35 మంది అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అయితే ఈ జాబితాలో కొందరు ఇలా చేరి.. అలా టికెట్ సంపాదించుకున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఓడించి జాయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్‌తో పాటు, మాజీ మంత్రి కృష్ణా యాదవ్‌కు థర్డ్ లిస్ట్‌లో చోటు దిక్కింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మూడో విడుతలో 35 మంది అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అయితే ఈ జాబితాలో కొందరు ఇలా చేరి.. అలా టికెట్ సంపాదించుకున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఓడించి జాయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్‌తో పాటు, మాజీ మంత్రి కృష్ణా యాదవ్‌కు థర్డ్ లిస్ట్‌లో చోటు దిక్కింది. చిత్తరంజన్ దాస్ కు జడ్చర్ల నియోజకవర్గం, కృష్ణాయాదవ్‌కు అంబర్ పేట స్థానాన్ని కేటాయించింది బీజేపీ అధిష్టానం. వారితో పాటు కేఎస్ రత్నం, చల్లా శ్రీలతారెడ్డి కూడా ఇటీవలే బీజేపీలో చేరారు. కాగా కేఎస్ రత్నంకు చేవెళ్ల, హుజూర్ నగర్ టికెట్ చల్లా శ్రీలతారెడ్డికి కేటాయించారు. కొద్ది రోజుల క్రితం చేరిన వారికి కూడా టికెట్ దక్కడంతో పలువురు నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఫస్ట్ లిస్ట్ లోనూ కొత్తగా చేరిన పలువురికి టికెట్ దక్కడంతో ఎన్నోరోజులు కష్టపడిన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా థర్డ్ లిస్ట్ లోనూ అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం.
పంతం నెగ్గించుకున్న నేతలు
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ముషీరాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించింది. దత్తాత్రేయ కూడా తీవ్రంగా శ్రమించారు. కానీ వారికి వృథా ప్రయాసే మిగిలింది. ఆ స్థానాన్ని చేజార్చుకోవద్దని భావించిన లక్ష్మణ్ తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకున్నారు. మూడో జాబితాలో లక్ష్మణ్ అనుచరుడు పూస రాజుకు అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. నారాయణఖేడ్ స్థానాన్ని ఎట్టకేలకు జర్నలిస్టుగా తనదైన ముద్ర వేసిన జెనవాడ సంగప్పకు టికెట్ కేటాయించారు. వాస్తవానికి ఫస్ట్ లిస్ట్ లోనే తన పేరు ఉందని రాష్ట్ర నాయకత్వం ఆయనకు కాల్ చేసి మరీ అభినందనలు తెలిపింది. కానీ జాబితాలో చూస్తే ఆయన పేరు కనిపించలేదు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శలు వచ్చాయి.
ఇక ఫస్ట్ లిస్ట్ లో టికెట్ దక్కకపోవడంపై పలువురు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఆ జాబితాలో సినీనటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ఒకరు. తనకు టికెట్ ఎందుకు కేటాయించలేదని బహిరంగంగానే పలువురిపై విమర్శలు చేశారు. తాను పోటీ చేయబోనని తేల్చి చెప్పినా ఆయనకు మూడో జాబితాలో పార్టీ టికెట్ కేటాయించడం గమనార్హం. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేరు కూడా ఫస్ట్ లిస్ట్ లో కనిపించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి లోనయ్యారు. దానికి తోడు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కమలం పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. దీంతో ఆయనకు టికెట్ కన్ఫామ్ అని భావించారు. తీరా బేతి చేరకపోవడంతో ఎట్టేకేలకు టికెట్ ఎన్వీఎస్ఎస్ కే కేటాయించారు.
ఆశించి.. భంగపడ్డారు..!
పలువురు కీలక నేతలు టికెట్ ఆశించి భంగపడ్డారు. అందులో హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి ఉన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె టికెట్ ఆశించారు. కానీ ఆ స్థానాన్ని మేకల సారంగపాణికి కేటాయించింది అధిష్టానం. ముషీరాబాద్ టికెట్‌ను బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆశించారు. కానీ ఆ స్థానంలో పూస రాజు వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఇక జూబ్లీహిల్స్ స్థానం నుంచి విక్రమ్ గౌడ్, జూటూరి కీర్తిరెడ్డి, పద్మ వీరపనేని ఆశించారు. కానీ ఆ సెగ్మెంట్ ను లంకల దీపక్ రెడ్డికి పార్టీ కేటాయించింది. ఇకపోతే ఆకుల విజయ సనత్ నగర్ టికెట్ ఆశించారు. ఆ స్థానాన్ని మర్రి శశిధర్ రెడ్డికి పార్టీ కేటాయించింది. కాగా ఇటీవలే సనత్ నగర్ లో ఆమె పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. వీరితో పాటు మహిళా మోర్చాలో ఒక్కరికి కూడా టికెట్ దక్కలేదు. మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి ఐదు స్థానాలకు దరఖాస్తు చేసినా ఆమెకు టికెట్ కేటాయించకపోవడం గమనార్హం.
పీట ముడివన్నీ పెండింగ్
భారతీయ జనతా పార్టీ మొత్తం ఇప్పటి వరకు 88 స్థానాలు ప్రకటించింది. కాగా 31 స్థానాలు పెండింగ్ లో పెట్టింది. పీట ముడి ఉన్న సెగ్మెంట్లను నాలుగో విడుతలో భాగంగా కమలం పార్టీ ప్రకటించనుంది. జనసేనతో పొత్తు కుదిరితే 8 లేదా 9 స్థానాలను ఆ పార్టీకి కేటాయించనున్నారు. కాగా మిగిలిన స్థానాలపై కసరత్తు జరుగుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరుకు తోడు అభ్యర్థుల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ఆ స్థానాలను పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. శేరిలింగంపల్లి, తాండూరు, కూకట్ పల్లి, హుస్నాబాద్, వేములవాడ సీట్లపై పలువురు నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తుండటంతో ఆ స్థానాలు పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం.