Nominations Today: మొదలైన నామినేషన్ల ప్రక్రియ.. తొలి రోజే ఎంత మంది అంటే..?

తొలి రోజు చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ఎటువంటి ఆర్భాటం లేకుండా నామినేషన దాఖలు చేశారు. అటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తరుఫున తొలి సెట్ నామినేషన్ దాఖలయ్యాయి.

Nominations Today:  మొదలైన నామినేషన్ల ప్రక్రియ.. తొలి రోజే ఎంత మంది అంటే..?
TS Elections
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 03, 2023 | 7:53 PM

తెలంగాణ ఎన్నికల్లో కీలక ఘట్టం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థులు ఈ నెల 10 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. తొలి రోజు అనేక మంది ఇండిపెండెంట్లు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు.

నవంబర్‌ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. నవంబర్‌ 3 నుంచి నవంబర్‌ 10 వరకు ఆదివారం మినహా అన్ని రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 13న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 15.

మరో వైపు తొలి రోజు చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ఎటువంటి ఆర్భాటం లేకుండా నామినేషన దాఖలు చేశారు. అటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పోటీ చేయనున్న కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి వెంటరాగా, రేవంత్‌ రెడ్డి తరపున సోదరుడు తిరుపతి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వికారాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌ తొలి రోజే నామినేషన్ వేశారు.

మంచి రోజు కావడంతో తొలి నామినేషన్ వేశానని, నవంబర్‌ 9న బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేస్తానని నిర్మల్‌ బీజేపీ అభ్యర్థి మహేశ్వరరెడ్డి ప్రకటించారు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి రత్నం తరపున ఆయన కుమారుడు రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రం సమర్పించారు. బెల్లంపల్లి, భూపాలపల్లిలోనూ బీజేపీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు.

తొలిరోజు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు నామినేషన్ దాఖలయ్యాయి. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొదటి రోజు భారతీయ జనతా పార్టీ తరఫున నరేష్ కుమార్ కారపూరి నామినేషన్ దాఖలు చేశారు. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో విద్యార్థుల రాజకీయ పార్టీ తరుఫున తమ్మేర మన్మోహన్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరుపున పెరుమాండ్ల వేదభూషణ్‌లు నామినేషన్ దాఖలు చేశారు.

మరో వైపు ఓటర్లకు స్లిప్పుల పంపిణీ నవంబర్ 10 నుంచి ప్రారంభించనున్నామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. తుది ఓటర్ల జాబితాను నవంబర్ 10వ తేదీ తర్వాత ప్రచురిస్తామని వెల్లడించారు. ఇదిలావుంటే, GHMC పరిధిలో పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేకంగా మిషన్‌ 29 పేరుతో అవగాహన కారక్రమాలు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో యువ ఓటర్లు అంటే తొలిసారి ఓటు వేసే 18, 19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 9 లక్షల 10 వేల 810 మందిగా ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరందరూ ఓటు వేసేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఎన్నికల సంఘం ప్రకటించింది.