AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తుపాకీ కోసం వెళ్తే ఊహించని ట్విస్ట్.. తనిఖీల్లో బయటపడ్డది చూసి అధికారులే అవాక్కు..

అటవీ జంతువులను వేటాడుతున్నాడన్న సమాచారంతో నాటు తుపాకీని పట్టుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ ఎదురైంది. వేటగాడి ఇంట్లో అణువణువూ గాలిస్తే.. తుపాకీ బదులు గుప్పుమంటూ గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. అధికారులు ఒకటి తలిస్తే సీన్ పూర్తిగా రివర్స్ అయిన ఈ షాకింగ్ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో తీవ్ర కలకలం రేపింది.

Telangana: తుపాకీ కోసం వెళ్తే ఊహించని ట్విస్ట్.. తనిఖీల్లో బయటపడ్డది చూసి అధికారులే అవాక్కు..
Ganja Seized In Dammapeta
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 17, 2026 | 3:18 PM

Share

ఈ మధ్యకాలంలో అటవీ ప్రాంతాల్లో మూగజీవాల వేట విచ్చలవిడిగా సాగుతుంది. కొందరు ముఠాలుగా ఏర్పడి వన్యప్రాణులను వేటాడుతూ ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం విద్యుత్ తీగలు, మారణాయుధాలు, నాటు తుపాకులను వాడుతున్నారు. ఈ క్రమంలో అమాయక జంతువులతో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ సిబ్బంది కూడా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అడవి జంతువులను నాటు తుపాకీతో వేటాడుతున్నారనే సమాచారంతో దమ్మపేట అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దమ్మపేట మండలం అంకంపాలెం పంచాయతీ పరిధిలోని కొడిశెలగూడెం గ్రామానికి చెందిన పి. సుబ్బులి నాగులు అనే వ్యక్తి నాటు తుపాకీతో అటవీ జంతువులను వేటాడుతున్నాడని అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది కొడిశెలగూడెంలోని నాగులు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

సోదాల్లో ఊహించని ట్విస్ట్

అధికారులు ఇల్లంతా క్షుణ్ణంగా గాలించినప్పటికీ ప్రధానంగా వెతుకుతున్న నాటు తుపాకీ మాత్రం వెంటనే దొరకలేదు. అయితే సోదాల సమయంలో ఇంట్లో అనుమానాస్పదంగా పడి ఉన్న రెండు ప్యాకెట్లను అధికారులు గమనించారు. వాటిని తెరిచి పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లు తేలడంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఇంట్లో మరింత లోతుగా సోదాలు నిర్వహించారు. మొత్తం మూడు ప్యాకెట్లలో నిల్వ ఉంచిన 5 కిలోల గంజాయిని గుర్తించారు. వీటితో పాటు నాటు తుపాకీలలో ఉపయోగించే 52 చిన్న సైజు ఇనుప చర్రాలు (పెల్లెట్స్), ఇతర ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

తుపాకీ కోసం పోలీసుల వేట..

స్వాధీనం చేసుకున్న గంజాయి, సామగ్రితో పాటు నిందితుడిపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనను పట్టుకోకుండా అధికారులను తప్పుదోవ పట్టించేందుకే నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం నాటు తుపాకీని ఎవరికీ అనుమానం రాని రహస్య ప్రదేశంలో దాచిపెట్టి ఉంటాడని పోలీసులు, అటవీ అధికారులు భావిస్తున్నారు. ఆ ఆయుధాన్ని రికవరీ చేసేందుకు నిందితుడి ఇంట్లో, సమీప ప్రాంతాల్లో మళ్లీ విస్తృత తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది.

Follow Us