Bhadrachalam Election Result 2023: భద్రాచలంలో బీఆర్ఎస్.. పొదెం వీరయ్యపై తెల్లం వెంకట్రావు విజయం
Bhadrachalam Assembly Election Result 2023 Live Counting Updates: భద్రాచలం అంటే సీపీఎం.. సీపీఎం అంటే భద్రాచలం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నియోజక వర్గంలో సీపీఎం చెప్పిందే వేదం. ఎనిమిది సార్లు వరుస విజయాలతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. భద్రాచలంలో ఎర్రజెండా రెప రెపలతో కంచుకోటగా మారింది.

భద్రాచలం నియోజకవర్గం.. నాలుగు రాష్ట్రాల సరిహద్దులో పూర్తి ఏజెన్సీ నియోజక వర్గం. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తిరుగులేని విజయాలతో ఇక్కడ ఎర్రజెండా ఎగిరింది. భద్రాచలం నియోజకవర్గం (Bhadrachalam Assembly Election) సీపీఎం పార్టీకి కంచుకోటగా మారింది. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలతో కొంత పట్టు కోల్పోయింది. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం పొత్తు కుదరక పోవడంతో, సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. సీపీఎంలకు బలమైన ఓటు బ్యాంకు, కేడర్ ఉన్న భద్రాచలంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రంగంలో ఉండటంతో అక్కడ హోరాహోరీ పోరు నెలకొంది. ఈ హోరాహోరి పోరులో బీఆర్ఎస్ విజయం సాధించింది. భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగిన హోరాహోరి పోరులో 4466 ఓట్లతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య రెండో స్థానంలో నిలిచారు.
ఈ ఎన్నికలకు ముందు సీపీఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. ఇద్దరి మధ్య దోస్తీ కటీఫ్ అయ్యింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం పోటీ చేస్తున్న 17 స్థానాల్లో భద్రాచలం కూడా ఒకటి. భద్రాచలం నుంచి సీపీఎం అభ్యర్థిగా కారం పుల్లయ్య బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య, బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు బరిలో నిలిచారు. బీజేపీ నుంచి కుంజ ధర్మారావు పోటీ చేశారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్
భద్రాచలం నియోజకవర్గంలో 1.48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నవంబరు 30న జరిగిన పోలింగ్‌లో ఈ నియోజకవర్గంలో 71.34 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
భద్రాచలం రాజకీయ ముఖ చిత్రం..
భద్రాచలం అంటే సీపీఎం.. సీపీఎం అంటే భద్రాచలం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో సీపీఎం చెప్పిందే వేదం. ఒక విధంగా చెప్పాలంటే భద్రాచలం ఏజెన్సీని శాసించింది. ఎనిమిది సార్లు వరుస విజయాలతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. భద్రాచలంలో ఎర్రజెండా రెపరెపలతో కంచుకోటగా మారింది.
1952 లో భద్రాచలం నియోజక వర్గం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇది పెద్ద నియోజక వర్గంగా ఉండేది. పోలవరం ముంపు మండలాలు వీఆర్.పురం, చింతూరు, కూనవరం మండలాలు 2014 వరకు భద్రాచలం నియోజక వర్గంలో ఉండేవి. ఉప ఎన్నికలతో కలుపుకుంటే 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1978, 1983 లో ముర్ల ఎర్రయ్య రెడ్డి సీపీఎం తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.1985, 1989, 1994లో కుంజా బుజ్జి సీపీఎం తరపున గెలిచారు. ఆ తర్వాత 1999, 2004, 2014ల్లో సున్నం రాజయ్య సీపీఎం తరపున ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. మొత్తం మీద ఎనిమిది సార్లు సీపీఎం పార్టీ విజయ ఢంకా మోగించింది.
గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్యకు 47,446 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావుకు 35,961 ఓట్లు, సీపీఎం అభ్యర్థి మిడియం బాబురావుకు 14,224 ఓట్లు పోలయ్యాయి. 11,554 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య విజయం సాధించారు.
ఈ లెక్కలు బట్టి చూస్తే.. భద్రాచలంలో ఏదో ఒక పార్టీ గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే స్థితిలో సీపీఎం ఓటు బ్యాంకు ఉందని స్పష్టమవుతోంది. పొత్తు ఉంటే కాంగ్రెస్ గెలుపు అవకాశం నల్లేరు మీద బండి నడక అయ్యేది. ఇప్పుడు ఇతర పార్టీల గెలపు లెక్కలను తారుమారు చేసే స్థితిలో సీపీఎం ఉంది. భద్రాచలంలో మారిన పరిణామాలతో చివరికి గెలుపు ఎవరిని వరిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్