Year Ender 2025: గగుర్పాటు కలిగించే పరిణామాలు.. 2025లో ప్రపంచ గమనాన్ని మార్చేసిన కీలక సంఘటనలు ఇవే!
ముగింపు దశకు చేరుకున్న 2025 సంవత్సరం ప్రపంచ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిపోనుంది. అగ్రరాజ్యాల్లో అధికార మార్పిడి నుంచి సరిహద్దుల్లో యుద్ధాల వరకు.. ప్రపంచ ఆర్థిక గమనంలో మార్పుల నుంచి ఆందోళనల వరకు ఎన్నో సంఘటనలు ఈ ఏడాది అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేశాయి. మొత్తంగా ఈ ఏడాది మిగిల్చిన కల్లోలం.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

యుద్ధాలు, దౌత్యపరమైన ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు.. ఇలా 2025 ప్రపంచ దేశాలను ఒక విభిన్నమైన మలుపుకు చేర్చింది. భారత్-పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నుంచి అమెరికా నూతన అధ్యక్షుడి నిర్ణయాల వరకు ఈ ఏడాది చోటు చేసుకున్న ప్రధాన పరిణామాలివి. మరో ఏడాది ముగుస్తోంది. అంతర్జాతీయ వేదికపై 2025 సంవత్సరం ఎన్నో సవాళ్లు, మార్పులకు వేదికైంది. అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పిడి, ఆసియా దేశాల్లో ఆందోళనలు, మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ఈ ఏడాది ప్రపంచాన్ని ఆలోచింపజేశాయి. ఆ ప్రధాన పరిణామాలు ఇలా ఉన్నాయి..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు నవంబరు 2024 ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. 2025 జనవరిలో అమెరికా 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఆయన రాకతో అమెరికా విదేశాంగ విధానంలో పెను మార్పులు సంభవించాయి. ముఖ్యంగా వాణిజ్య సుంకాలు, వలస విధానాలపై ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ‘ఆపరేషన్ సిందూర్’ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు నిరసనగా భారత సైన్యం మే 7న తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా.. ఇరాన్ కూడా ధీటుగా బదులిచ్చింది. అయితే అమెరికా జోక్యంతో చివరకు కాల్పుల విరమణ కుదిరింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా పరిష్కారం కాకుండానే కొనసాగుతూ అంతర్జాతీయ భద్రతకు సవాలుగా మారింది.
వాణిజ్య యుద్ధం.. నిరసన జ్వాలలు అమెరికా, చైనా మధ్య సాంకేతిక, వాణిజ్య పోటీ మరింత తీవ్రమైంది. చైనా దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించడం ప్రపంచ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపింది. ఇక దక్షిణాసియా దేశాల్లో నిరసనలు హోరెత్తాయి. బంగ్లాదేశ్‌లో కాల్పుల ఘటనలు, నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాల పతనానికి దారితీశాయి. పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
మొత్తంగా చూస్తే 2025 సంవత్సరం యుద్ధాలు, ఆర్థిక మార్పులు, రాజకీయ అనిశ్చితి మధ్య ముగింపు దశకు చేరుకుంది.
