Basara IIIT Students Protest: బాసర ట్రిపుల్ ఐటీలో చర్చలు సఫలం.. ఆందోళన విరమించిన విద్యార్థులు.. మంత్రి హామీతో..
వారం రోజుల నుంచి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో జరుగుతున్న చర్చలు విఫలమవ్వడంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి నేరుగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు చేరుకొని విద్యార్థులు, ఫ్యాకల్టీతో చర్చలు జరిపారు.
Basara IIIT Students Protest: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన ముగిసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చల అనంతరం విద్యార్థులు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. గత వారం నుంచి కొత్త వీసీని నియమించాలని, తమ న్యాయమైన హామీలను నెరవేర్చాలంటూ బాసర ఐఐటీలోని వేలాది మంది విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వారంగా జరుగుతున్న చర్చలు విఫలమవ్వడంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి నేరుగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు చేరుకొని విద్యార్థులు, ఫ్యాకల్టీతో చర్చలు జరిపారు. రెండు గంటలపాటు జరిగిన చర్చల్లో సబితా ఇంద్రారెడ్డితోపాటు 50 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకూ సాగిన చర్చలు సఫలమైనట్లు విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల డిమాండ్లను దశల వారీగా నేరవేర్చుతామని.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు తెలిపారు. దీంతోపాటు రూ.5 కోట్ల గ్రాంటు విడుదల, నెల రోజుల్లో వీసీని నియమిస్తామని సబితా ఇంద్రారెడ్డి హామీఇచ్చారని దీంతో ఆందోళనను విరమిస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు.
డిమాండ్లు అన్నింటిని పరష్కరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీనిచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ అలీకి విద్యార్థులు కృతజ్నతలు తెలిపారు. ఇది ముమ్మాటికీ విద్యార్థుల విజయమని.. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని విద్యార్థులు ప్రకటించారు. నేటి నుంచి (మంగళవారం) క్లాసులకు హాజరవుతామని విద్యార్థులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..