AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Justice Ujjal Bhuyan: హింస అనేది ఎప్పటికీ అమోదయోగ్యం కాదు.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్

Justice Ujjal Bhuyan: ఎవరిపైనా హింస అనేది నాగరిక సమాజంలో పూర్తిగా ఆమోదయోగ్యం కాదని.. తప్పు చేసేవారిని శిక్షించడానికి అనేక రాష్ట్రాలు చట్టాలను రూపొందించాయని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు.

Justice Ujjal Bhuyan: హింస అనేది ఎప్పటికీ అమోదయోగ్యం కాదు.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్
Ujjal Bhuyan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 21, 2022 | 12:04 AM

Telangana High Court Chief Justice Ujjal Bhuyan: హింస అనేది సమాజంలో ఎప్పటికీ అమోదయోగ్యం కాదంటూ తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. వైద్యులు, వైద్య సంస్థలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఉజ్జల్ భుయాన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు చిన్న నగరాలు, పట్టణాలలో ఎక్కువగా కనిపిస్తున్నాయని.. ఏ కారణంతోనైనా వైద్యులు, ఆరోగ్య సంస్థలపై దాడులు మంచిది కాదన్నారు. ఎవరిపైనా హింస అనేది నాగరిక సమాజంలో పూర్తిగా ఆమోదయోగ్యం కాదని.. తప్పు చేసేవారిని శిక్షించడానికి అనేక రాష్ట్రాలు చట్టాలను రూపొందించాయని ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. వైద్యులు లేదా ఆరోగ్య సంస్థలకు జరిగిన నష్టానికి అటువంటి వ్యక్తుల నుంచి జరిమానా విధించడం, నష్టపరిహార చర్యలు సకాలంలో అందించడం అవసరమన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘‘క్లినికల్ ఆంకాలజీ, ప్రాక్టీస్; ఫండమెంటల్స్, బేసిక్స్ అండ్ ది ఎసెన్షియల్స్’’ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఉజ్జల్ భుయాన్ మాట్లాడుతూ.. తాను వైద్య వృత్తికి అతీతుడను కానని పేర్కొన్నారు. సీనియర్ అడ్వకేట్, మాజీ అడ్వకేట్ జనరల్ అయిన తన నాన్న.. తాను పుట్టకముందే 30 ఏళ్ళ వయసులో మధుమేహ బాధితుడని వివరించారు. నియంత్రిత ఆహారపు అలవాట్లు, క్రమ వ్యాయామాలు, వైద్య సలహాలను అనుసరించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తూ పూర్తి జీవితాన్ని గడిపారన్నారు. ఎంతగా అంటే తన ఇద్దరు కూతుళ్లు డాక్టర్లు అయ్యేలా చూసుకున్నారని.. తన అక్క ENT స్పెషలిస్ట్ అని తెలిపారు. ఆమె గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ENT, డిపార్ట్‌మెంట్ హెడ్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నట్లు వివరించారు. తన చెల్లెలు నేత్ర వైద్య నిపుణురాలని.. ప్రస్తుతం రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆప్తాల్మాలజీ డైరెక్టర్‌గా గౌహతిలో సేవలందిస్తున్నారన్నారు. వారి భర్తలు డాక్టర్లని, వారి పిల్లల్లో కూడా డాక్టర్లు ఉన్నట్లు వివరించారు. అన్ని విధి నిర్వహణలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయన్నారు.

చట్టం-వైద్య రంగం

ఇవి కూడా చదవండి

క్రిమినల్ న్యాయశాస్త్రంలో వైద్య సాక్ష్యం లేదా వైద్య అభిప్రాయానికి ట్రయల్ కోర్ట్ గొప్ప వెయిటేజీని ఇస్తుందని ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. చట్టం-వైద్య రంగం కలిసి పనిచేసే అనేక శాసనాలు ఉన్నాయన్నారు. ఉదాహరణకు, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971 గురించి వివరించారు. వైద్యుల సలహా లేదా అభిప్రాయం ప్రకారం మాత్రమే గర్భాన్ని నిర్ణీత కాలం వరకు ముగించవచ్చన్నారు. అలాగే, మహిళల భ్రూణహత్యలను నిరోధించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పుట్టబోయే బిడ్డకు లింగ నిర్ధారణను నిషేధించే ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (సెక్స్ సెలక్షన్ నిషేధం) చట్టం, 1994ని కలిగి ఉన్నామని వివరించారు. ఇక్కడ కూడా చట్టం-వైద్యం ప్రజా ప్రయోజనాలను సాధించేందుకు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ పలు కేసుల గురించి సవివరంగా తెలియజేశారు.

తప్పులు చేయడం మానవ స్వభావంలో ఒక భాగం

వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నంత వరకు తనకు ఇబ్బంది కలిగించిన రెండు అంశాలు ఉన్నాయని వివరించారు. ఒకటి వైద్యులపై దాడులు, ఆసుపత్రి ఆస్తులను ధ్వంసం చేయడం, రెండవది వైద్యుల నిర్లక్ష్యంగా ఆరోపిస్తూ వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం.. అని పేర్కొన్నారు. హింస ఎప్పుడూ కూడా ఆమోదయోగ్యం కాదని తెలిపారు. అస్సాంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన అంశాన్ని వివరించారు. తప్పులు చేయడం మానవ స్వభావంలో ఒక భాగం. అయితే కొన్నిసార్లు ఈ పొరపాట్లు మరొక వ్యక్తికి హాని కలిగిస్తాయి. అది ప్రాణనష్టానికి దారితీయవచ్చు. అలాంటి నిర్లక్ష్యాన్ని ‘వైద్య నిర్లక్ష్యం’ అంటారు. నిర్లక్ష్యపు నేరాన్ని నిర్ధారించడానికి కోర్టులు సాధారణంగా ‘బోలం టెస్ట్’ అనే పరీక్షను నిర్వహిస్తాయని తెలిపారు. వైద్యపరమైన నిర్లక్ష్యంగా ఆరోపణలు వస్తే దీనిపై ఫిర్యాదు అందితే.. దర్యాప్తు అధికారి తప్పనిసరిగా ప్రాథమిక విచారణను నిర్వహించాలని.. ఆ తర్వాత విచారణ ఫలితాన్ని బట్టి FIR మాత్రమే నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు. సివిల్ యాక్షన్, క్రిమినల్ చర్యలు ప్రాథమికంగా భిన్నమైనవని.. ఒకటి నష్టపరిహారం కోసం, మరొకటి శిక్ష కోసం ఉంటాయన్నారు.

నిజమైన సంపద ఆరోగ్యమే..

చివరిగా ఉజ్జల్ భుయాన్ మట్లాడుతూ.. మహాత్మాగాంధీ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి.. ‘‘ఒక వ్యక్తి నిజమైన సంపద ఆరోగ్యం.. బంగారం, వెండి ఆభరణాలు కాదు’’.. ఒక వ్యక్తి వైద్యుడి వద్దకు చికిత్స కోసం వెళితే, అతని సంపద డాక్టర్ చేతిలో ఉంటుంది. అందుకే వైద్య వృత్తి పవిత్రమైనదని పేర్కొంటారు. ఎందుకంటే.. రోగికి వైద్యుడు దేవుడిలా పక్కన ఉంటాడు.. అని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పీఎస్ దత్తాత్రేయ, పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..