Telangana: పనులు ముగించుకుని వెళ్లిన బ్యాంక్ సిబ్బంది.. కట్ చేస్తే.. తెల్లారేసరికి షాకింగ్ సీన్..
నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్‌లోని గ్రామీణ బ్యాంకులో దొంగలు రూ.7 లక్షల నగదుతో పాటు రూ.కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
Bank robbery in Nizamabad: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో భారీ దోపిడి కలకలం రేపింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరగ్గా, ఆదివారం బ్యాంకుకు సెలవు కావడంతో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్‌లోని గ్రామీణ బ్యాంకులో దొంగలు రూ.7 లక్షల నగదుతో పాటు రూ.కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న బీఎస్‌ఎన్ఎల్ కార్యాలయం నుంచి దొంగలు బ్యాంకు భవనంలోకి ప్రవేశించారు. బ్యాంకు షట్టర్‌ను సినీ ఫక్కీలో గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం బ్యాంకులోని లాకర్లను గ్యాస్‌కట్టర్‌తో కట్ చేసి భారీ చోరి చేసినట్లు పోలీసులు గుర్తించారు.
బ్యాంకు లాకర్‌లోని రూ.7లక్షల నగదు, బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుందని బ్యాంకు సిబ్బంది అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం సహాయంతో పలు ఆనవాళ్లను కూడా సేకరిస్తున్నారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి