Sagar Election : అదృష్టం కలిసొచ్చి దుబ్బాక రిజల్ట్ రిపీటవుతుందా?, సాగర్ అభ్యర్థి విషయంలో కమల వ్యూహం ఫలిస్తుందా?.. అసలేంజరుగుతుంది.!
Nagarjuna Sagar By Election - BJP Strategy : దుబ్బాకలో జాక్‌పాట్. గ్రేటర్‌లో గన్‌షాట్. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే లెక్క తప్పింది. దీంతో సాగర్‌లో సంచలనం సృష్టించాలనుకుంటోంది కమలం పార్టీ. అందుకే..
Nagarjuna Sagar By Election – BJP Strategy : దుబ్బాకలో జాక్‌పాట్. గ్రేటర్‌లో గన్‌షాట్. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే లెక్క తప్పింది. దీంతో సాగర్‌లో సంచలనం సృష్టించాలనుకుంటోంది కమలం పార్టీ. అందుకే అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ చోట గట్టిపోటీఇచ్చినా…గెలుపుగుర్రం ఎక్కలేకపోయిన బీజేపీ..సాగర్ ఉప ఎన్నికను ప్రెస్టీజియస్ గా తీసుకుంది. దుబ్బాక మ్యాజిక్ రిపీట్‌చేయాలనే పట్టుదలతో ఉంది. కలిసొచ్చే ఏ అవకాశాన్నీ వదలకూడదనుకుంటోంది. బీజేపీ ఉత్సాహానికి తగ్గట్లే టికెట్ కోసం ఆ పార్టీలో కాంపిటీషన్ నడుస్తోంది.
నామినేషన్ వేయడానికి మంగళవారం ఒక్కరోజే మిగిలుంది. ఇప్పటిదాకా సాగర్‌లో తన అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీ. అధికారపార్టీ ఎనౌన్స్ చేశాక క్యాండేట్‌ని ప్రకటించాలన్న స్ట్రాటజీతో కమలం పార్టీ ఉంది. నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర నేతలు…పార్టీ అభ్యర్థిపై చర్చించారు. రేసులో ఉన్న నేతల్లో ఎవరైతే బావుంటుందన్న దానిపై అభిప్రాయాలు సేకరించారు. అయితే, అభ్యర్థిని ప్రకటించకముందే ఓ మహిళానేత నామినేషన్ వేయడం బీజేపీలో చర్చనీయాంశమైంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి భార్య నివేదిత టికెట్‌పై ధీమాతో నామినేషన్ వేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నివేదిత…పార్టీ తనకే టికెట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
నామినేషన్‌వేసి మహిళా నేత ఆశలు పెట్టుకున్నా.. సాగర్ సామాజిక సమీకరణాలతో… అంజయ్య, రవినాయక్ పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. నామినేషన్ వేసిన నివేదితకే బీజేపీ బీఫాం ఇస్తుందా…లేదంటే మిగిలిన ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇస్తుందా..అనూహ్యంగా వేరెవరినయినా తెరపైకి తెస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. గులాబీపార్టీ టికెట్ ఆశించి భంగపడ్డవారిలో ఎవరయినా ముందుకొస్తారనే బీజేపీ వ్యూహాత్మకంగా ఆలస్యం చేస్తోందన్న ప్రచారం నడుస్తోంది.
ఇక, సాగర్ ఉప ఎన్నిక కోసం బీజేపీ నియోజకవర్గ, మండల కోఆర్డినేటర్లను నియమించింది. ముగ్గురు మాజీ మంత్రులు, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు ఓ మాజీ ఎంపీ సహా 11మందికి..సాగర్ ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ చాడసురేష్‌రెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమించారు. టీఆర్‌ఎస్-కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న సాగర్‌లో.. ఆ రెండు పార్టీలపై సంచలన ఆరోపణలుచేసింది బీజేపీ. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనేది బీజేపీ డౌట్. జానారెడ్డి గెలుపు కోసమే.. టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేత NVSS ప్రభాకర్ ఆరోపించారు.
దుబ్బాక, GHMC ఎన్నికల జోష్ కచ్చితంగా సాగర్‌లో ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు కమలం నేతలు. అందుకే సాగర్ టికెట్ కోసం కాంపిటీషన్ నడుస్తోందని చెప్పుకుంటున్నారు. మరోవైపు…మూడు పార్టీలే కాకుండా టీడీపీ కూడా సాగర్ బరిలో అభ్యర్థిని నిలబెట్టింది. టీడీపీ అభ్యర్థి మువ్వా అరుణ్‌కుమార్‌తో పాటు టీటీడీపీ నేతలతో తన నివాసంలో సాగర్ బైపోల్ ప్రచారంపై సమీక్షించారు చంద్రబాబు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రచారంచేస్తూ గట్టిగా పోరాడాలని పార్టీ నేతలకు సూచించారు. మొత్తానికి…పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలైపోగానే సాగర్ బైపోల్ ప్రచారంతో…పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది.