Telangana: పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ రాతి విగ్రహం.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం.!
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడిలో 800 ఏళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న పార్శ్వనాధుని రాతి విగ్రహం లభ్యమైంది.

తెలంగాణ, జూలై 26: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడిలో 800 ఏళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న పార్శ్వనాధుని రాతి విగ్రహం లభ్యమైంది. తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీకాంత్, కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ బి శంకర్‌లు ఈ విగ్రహాన్ని గుర్తించారు. విగ్రహం ఛాతి భాగం మాత్రమే ఉండి.. మిగిలిన భాగం విరిగిపోయి ఉంది. విగ్రహానికి తల వెనుక భాగంలో ఏడు పడగల పాము, చెవులకు కుండలాలు ఉన్నాయి. ఈ విగ్రహం దాదాపు 800 ఏళ్ల క్రితం జైన మత ప్రాబల్యం అధికంగా ఉన్నకాలంలో చెక్కబడిందని భావిస్తున్నారు. తొలి కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలో జైన బసది ఉండే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ విగ్రహం 150 ఏళ్ల కన్నా ముందు నుంచే కృష్ణజీవాడి గ్రామంలో ఉందని గ్రామస్తుల తెలిపారు. ఇదే గ్రామంలో చెరువు కట్ట కింద కొన్ని శిల్పాలు ఉన్నాయని.. అందులో కొంతభాగం విరిగిపోయిన వేణుగోపాల స్వామి పోలికలు గల విగ్రహం గుర్తించామన్నారు.
పార్శ్వనాధుని విగ్రహానికి వెనుక భాగంలో నాగుపాములు ఉండడంతో ఈ ప్రాంతాన్ని నాగులగుట్టగా పిలుస్తారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఉన్న రాజరాజేశ్వర ఆలయ కోనేరు వద్ద ఉన్న లింగం, నంది విగ్రహాలను ఇక్కడి నుంచి ఆలయానికి తరలించారని, బహుశా ఈ జైన పార్శ్వ విగ్రహం చెరువు కట్ట నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. పార్శ్వనాధుని విగ్రహానికి సంబంధించిన చరిత్రపై మరింత పరిశోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు. గ్రామంలో పార్శ్వనాధుని విగ్రహం వెనుక నాగుపాములు ఉండడంతో గ్రామస్తులందరూ ప్రతి సంవత్సరం నాగపంచమి రోజు ప్రత్యేక పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా మారిందని తెలిపారు.

