Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్‌లు అంటే..
తెలంగాణలో మున్నిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 11న జరగనున్న పోలింగ్‌కు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిపేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,203 పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ భద్రత కల్పించామని, ఇందులో 1,302 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 1,926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రం వెలుపల కూడా నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 3 వేల మంది అదనపు బలగాలను రంగంలోకి దించామని, ఇందులో టీజీఎస్పీతో పాటు అటవీ, ఎక్సైజ్, సీఐడీ, లీగల్ మెట్రాలజీ విభాగాల సిబ్బంది కూడా ఉన్నారని వివరించారు.
మొత్తం ఎన్ని కోట్లు పట్టుపడిందంటే..?
సోమవారం సాయంత్రం 5 గంటల నుంచే ప్రచార పర్వం ముగియడంతో సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చిందని, ప్రస్తుతం విజిబుల్ పోలీసింగ్‌ను పెంచి గస్తీని ముమ్మరం చేసినట్లు డిజిపి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన గత నెల 27 నుంచి ఇప్పటి వరకు పోలీసులు రికార్డు స్థాయిలో తనిఖీలు చేపట్టి మొత్తం రూ. 3.09 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డిజిపి వెల్లడించారు. ఇందులో రూ. 1.29 కోట్ల నగదు, రూ. 1.21 కోట్ల విలువైన మద్యం, రూ. 15.7 లక్షల విలువైన మాదకద్రవ్యాలు, రూ. 28.69 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులను, జిల్లాల సరిహద్దుల్లో 55 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు.
ప్రత్యేక తనిఖీలు
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలు సాగుతున్నాయని, ఇందుకోసం 181 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 167 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయని డీజీపీ పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా 1,183 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేయించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 4,318 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. వివిధ కేసుల్లో పెండింగ్‌లో ఉన్న 398 నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేశామని, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 142 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామని, ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, భయం లేకుండా తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ సూచించారు.
