MLC Elections: నేటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. ఉదయం 8 గంటల నుంచే పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం (మార్చి 13) జరిగే పోలింగ్ కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుంది.

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం (మార్చి 13) జరిగే పోలింగ్ కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికారపార్టీ ఉవ్విలూరుతుండగా, అటు విపక్షాలు ఆ స్థానాలను దక్కించుకునేందుకు జోరుగా ప్రచారం చేశాయి. తూర్పు రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గం, టీచర్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గం, టీచర్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. ఇక ఉత్తరాంధ్ర నియోజకవర్గానికి సంబంధించి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కేవలం పట్టభద్రుల నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్స్ లు, సామగ్రి.. పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ప్రయారిటీ ఓటింగ్ కాబట్టి బ్యాలెట్ పేపర్‌లో పార్టీల గుర్తులు ఉండవు. అభ్యర్థుల పేర్లు, వారి ఫొటోల ఎదురుగా 1, 2, 3 అనే అంకెలు మాత్రమే వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్ పై టిక్ మార్క్ లు, వ్యాఖ్యానాలు, సంతకాలు.. ఇతర ఎలాంటి మార్కింగ్ చేసినా ఓట్లు చెల్లుబాటు కావు. కాగా ఎన్నికలు జరిగే 9 జిల్లాల్లో కోడ్ అమలులో ఉంది. మద్యం షాపుల్ని మూసివేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆ వెంటనే ఫలితాలు విడుదల కానున్నాయి.
తెలంగాణలోనూ..
ఇక తెలంగాణలో 1 టీచర్, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి హైదరాబాద్ జిల్లాలో 25 బూత్‌లతో పాటు మొత్తం 139 పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయగా, రంగారెడ్డి జిల్లాలో 31 పోలింగ్ స్టేషన్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. . పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించామని, ప్రతి కేంద్రం నుంచి 200మీటర్ల దూరం వరకు ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమన్నారు. 144సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








