Telangana: యాటను కోస్తా.. బహుమతి ఇస్తా.. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే బంపర్ ఆఫర్!
సాధారణంగా ఆఫర్లు అనేవి షాపింగ్ మాల్స్, ఆన్‌లైన్ సేల్స్‌లో చూస్తుంటాం. తమ ఉత్పత్తులు, వస్తువులను విక్రయించేందుకు వ్యాపార సంస్థలు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే కొన్ని సార్లు ప్రభుత్వం కూడా ఆస్తి పన్ను, విద్యుత్ వంటి బకాయిలను రాబట్టుకునేందుకు అప్పుడప్పుడు కొన్ని ఆఫర్లను ప్రకటిస్తుంది. కానీ ఓ ప్రభుత్వ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసినవారికి ఓ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆయన ఇచ్చిన ఆఫర్ ఏమిటో తెలుసుకుందాం పదండి.

ఆయన యాదాద్రి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తలలో నాలుకలా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎప్పుడూ ఆయన నియోజక వర్గ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నీడ కల్పిస్తామనీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ హామీలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్నీ అమలు చేస్తోంది. తన నియోజక వర్గంలో ఈ పథకం అమలుపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొదటి విడతలో తన నియోజక వర్గానికి మంజూరైన 3500 ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులను ఎంపీక చేశారు.
అయితే, ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునే వారికి ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. సకాలంలో ఇందిరమ్మ ఇంటిని నిర్మాణం చేసుకునే వారి గృహప్రవేశానికి యాటను తీసుకొస్తానని.. ప్రత్యేక బహుమతి కూడా ఇస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
వీడియో చూడండి..
ఎవరైతే సకాలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేస్తారో.. వారి ఇంటి గృహప్రవేశానికి యాటను తీసుకువచ్చి వారితో పాటే భోజనం చేస్తానని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వారికి అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తానని కూడా ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఐలయ్య ప్రభుత్వం తనకు ఇచ్చే నెలసరి వేతనంలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటున్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ హాస్టల్లో చదువు కుంటున్న విద్యార్థులకు వినియోగిస్తున్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇచ్చిన బంపర్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటామని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..