Asaduddin Owaisi: బక్రీద్ పండుగకు వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. రాష్ట్ర డీజీపీకి లేఖ రాసిన మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ
తెలంగాణ రాష్ట్రంలో బక్రీద్ పండుగ సందర్భంగా రెండు పార్టీలు పోటా పోటీ లేఖాస్త్రాలు సంధించుకుంటున్నాయి. చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి లేఖలు రాసాయి.
Asaduddin Owaisi Letter to DGP: తెలంగాణ రాష్ట్రంలో బక్రీద్ పండుగ సందర్భంగా రెండు పార్టీలు పోటా పోటీ లేఖాస్త్రాలు సంధించుకుంటున్నాయి. బక్రీద్ పండగ పేరుతో జరిగే గోవధను అడ్డుకోవాలని భారతీయ జనతాపార్టీ అంటుంటే, సంప్రదాయ పండుగలను అడ్డుకోవడం సరికాదని మజ్లిస్ పార్టీ పేర్కొంటోంది. ఈ మేరకు రెండు పార్టీల నేతలు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖలు రాశారు.
రాష్ట్రంలో బక్రీద్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్ర డీజీపీని కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను రాశారు. బక్రీద్ కోసం తరలిస్తున్న పశువులను అడ్డుకుని వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి తరలిస్తున్న పశువులను అడ్డుకోవద్దని ఆయన కోరారు. వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు.
ఇదిలావుంటే, వచ్చే నెలలో జరిగే బక్రీద్ కోసం.. ముందస్తుగా గోవులను లారీల్లో హైదరాబాద్‌కి తరలిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గోవుల అక్రమ తరలింపు జోరుగా సాగుతుందని ఆయన అన్నారు. బక్రీద్ సందర్భంగా గోవుల అక్రమ తరలింపు ఎక్కువైందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే రెండు లారీలు పట్టుకుని పోలీసులకు అప్పగించామని రాజాసింగ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని హైవేలపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని డీజీపీ పోలీసు కమిషనర్లను ఆయన కోరారు. పోలీసులు అలర్ట్‌గా ఉండి.. గోవుల దిగుమతిని అడ్డుకోకపోతే.. తాము పట్టుకున్న వాహనాలతో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.
Read Also… పాకిస్తాన్ లో పేలుడు ఘటన..ఉగ్రవాది హఫీజ్ సయీద్ టార్గెట్.. జర్నలిస్ట్ వెల్లడి…