Telangana: సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆయుర్వేద మందులు వాడుతున్నారా..? ఈ విషయం తెలుసుకోండి
ఆదిలాబాద్‌లో ఆయుర్వేద మందుల పేరుతో మోసాలు! చిన్నారులు, వృద్ధులను టార్గెట్ చేస్తూ నకిలీ మందులు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన 9 మందిపై కేసు నమోదు చేసి, 8 మంది అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

ఆదిలాబాద్ పట్టణంలో సాయి ఆయుర్వేద మందుల దుకాణం పేరుతో సాగుతున్న నకిలీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అమ్మకాల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. చిన్న పిల్లలు , వృద్దులే టార్గెట్‌గా రోగం నయం చేస్తామంటూ నమ్మించి నకిలీ ఆయుర్వేదిక్ మందులు అంటగడుతున్న ముఠాను వలపన్ని పట్టుకున్నారు ఆదిలాబాద్ పోలీసులు. 9 మందిపై కేసు నమోదు చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంmr ఆరు ద్విచక్ర వాహనాలు, 15 మొబైల్ ఫోన్స్, 12 సిమ్ కార్డులు, నకిలీ ఆయుర్వేదిక్ మందులు.. పదివేల నగదు, ఆయుర్వేదిక్ మందుల షాపుకు చెందిన బ్యాంకు అకౌంట్‌లలోని 23 వేల నగదును సీజ్ చేశారు పోలీసులు.
నిందితులు కర్ణాటకకు చెందిన వ్యక్తులుగా గుర్తించినట్టు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ అనే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి బాబా అవతారం ఎత్తి మరో ఎనిమిది మందితో కలిసి ముఠాగా ఏర్పాడి ఆయుర్వేద వైద్యం పేరిట మోసాలకు పాల్పడుతున్నాడు. ఆదిలాబాద్ పట్టణంలో సాయి ఆయుర్వేదిక్ మందుల దుకాణాన్ని తెరిచిన కుమార్.. తమ వద్ద అన్ని రోగాలకు మందులు లభిస్తాయని నమ్మబలుకుతూ.. ఆస్పత్రుల వద్ద ముఠా సభ్యులను ఉంచి అమాయక జనాలను బుట్టలోకి వేసుకుని నకిలీ ఆయుర్వేద మందులను అంటగడుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ కుటుంబానికి ఆయుర్వేద మందులు ఇవ్వగా.. అనారోగ్యం తగ్గకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి 8 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
నిందితులంతా కర్ణాటకు చెందిన వారని.. వీరందరూ ఇదివరకే సూర్యాపేట, ఖమ్మం, సిద్దిపేట జిల్లాలలో ఇలాంటి మోసాలకు పాల్పడి తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మోసాలకు తెరలేపారని పేర్కొన్నారు ఎస్పీ. జిల్లా ప్రజలు ఎలాంటి బాబాలను, మూఢనమ్మకాలను నమ్మకుండా గుర్తింపు పొందిన వైద్యులను సంప్రదించి సరైన వైద్య చికిత్సను తీసుకోవాలని సూచించారు. గుర్తింపు పొందిన ఆయుర్వేద వైద్యుల ద్వారానే చికిత్స, మందులు పొందాలని సూచించారు. నకిలీ మందులను వాడటం వల్ల ఉన్న రోగాలు పోకపోగా.. కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఎస్పీ హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




