Cycle Yatra: ‘మట్టిని రక్షించు’ అనే నినాదంతో 30 వేల కిలోమీటర్ల యువకుడి సైకిల్ యాత్ర.. ఎమ్మెల్యే సన్మానం
దేశమంటే మనుషులు కాదోయ్.. దేశమంటే మట్టి అని కొందరు అంటున్నారు. మానవాళికి ఉపయోగపడే ఆ మట్టిని రక్షించాలని ఓ యువకుడు కంకణం కట్టుకున్నాడు. సేవ్ సాయిల్ పేరుతో ప్రజల్లో మట్టిపై అవగాహన కల్పించేందుకు..
దేశమంటే మనుషులు కాదోయ్.. దేశమంటే మట్టి అని కొందరు అంటున్నారు. మానవాళికి ఉపయోగపడే ఆ మట్టిని రక్షించాలని ఓ యువకుడు కంకణం కట్టుకున్నాడు. సేవ్ సాయిల్ పేరుతో ప్రజల్లో మట్టిపై అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్ర చేపట్టాడు యువకుడు. ఈ సైకిల్ యాత్ర వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ లలిత్ పూర్ చెందిన 21 ఏళ్ల మోహిత్ నిరంజన్.. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ మొదలుపెట్టిన సేవ్ సాయిల్ ఉద్యమంతో స్ఫూర్తిని పొందాడు. జీవవైవిద్యానికి మూలాధారమైన మట్టి రక్షణపై అవగాహన కల్పించేందుకు తన ప్రయత్నంగా సైకిల్ యాత్ర చేపట్టాడు. దేశ వ్యాప్తంగా “మట్టిని రక్షించు” అనే నినాదంతో సైకిల్ మీద 30,000 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. గత ఏడాది నవంబర్ 16న లలిత్‌పూర్ లో మొదలైన నిరంజన్ సైకిల్ యాత్ర ఇప్పటివరకు 6450 కిలోమీటర్లు సాగింది. ఈ సైకిల్ యాత్ర ఆరు రాష్ట్రాలు – ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించింది. తెలంగాణ వ్యాప్తంగా సాగిన యాత్ర సోమవారం నల్గొండ చేరుకుంది. నల్గొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మోహిత్‌ని శాలువాతో సత్కరించి అభినందించారు. ఎనిమిది నెలలుగా సాగిన ఈ యాత్ర మరో రెండేళ్లు.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, వైజాగ్ మీదుగా ఒరిస్సా భువనేశ్వర్, ఝార్ఖండ్ రాంచీ, మీదుగా పశ్చిమ బెంగాల్లో ప్రవేశించి కోల్‌కతా మీదుగా సైకిల్ యాత్ర కొనసాగనుంది. ఇలా అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తూ కోయంబత్తూర్‌లో సైకిల్ యాత్ర ముగియనుంది.
పర్యావరణంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ భూమిని కాపాడుకోవడం అత్యవసరమని మోహిత్ నిరంజన్ అన్నారు. సేంద్రియ పదార్థాలతో భూమిని కాపాడుకోకపోతే మరో 30 ఏళ్ల తర్వాత ఆహార ధాన్యాలు ఉత్పత్తి కొరత ఏర్పడుతుందని చెప్పారు. ఆధునిక ప్రపంచంలో నేల పూర్తిగా కలుషితమై పోతోందని, కలుషిత ఆహారం వల్ల మనం రోగాల పాలవుతున్నామని మోహిత్ అన్నారు. మట్టి అంతరించిపోకుండా రక్షించేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. జీవ వైవిద్యంలో భాగంగా మట్టిని కాపాడుకుందాం మనుషులమవుదామంటూ ఆయన కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి