Telangana: కన్నీళ్లకే కష్టాలు..! లారీ ప్రమాద ఘటనలో ఒక్కో కుటుంబానిది.. ఒక్కొక్క కథ..!

వేగంగా దూసుకువచ్చిన లారీ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న వారిపైనుంచి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. లారీ వేగానికి చెట్టు కూడా కుప్పకూలిపోయింది..

Telangana: కన్నీళ్లకే కష్టాలు..! లారీ ప్రమాద ఘటనలో ఒక్కో కుటుంబానిది.. ఒక్కొక్క కథ..!
Lorry Accident
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Balaraju Goud

Updated on: Dec 03, 2024 | 1:04 PM

రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ – బీజాపూర్ హైవే రోడ్డుపై లారీ బీభత్సంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే..! ఈ ఘటనతో మృతుల కుటుంబాలలో తీరని విషాదం నెలకొంది. ఒకరు తమ పెద్దదిక్కును కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే, మరొక కుటుంబంలో కన్నతల్లిని కోల్పోయారు. ఇటీవల పరీక్షలు రాసి రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఓ సోదరుడు.. పని కోసం వచ్చిన కొడుకు.. ఇలా వారి వారి కుటుంబాలలో ఒక్కొక్కరు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు..

సోమవారం(డిసెంబర్ 2) మధ్యాహ్నం కూరగాయలు అమ్మేందుకు ఇంట్లో నుంచి వచ్చిన వారంతా లారీ రూపంలో వచ్చిన మృతు శకటానికి బలయ్యారు. ఆలూరు గ్రామానికి చెందిన రాములు ఈ లారీ ప్రమాదపు ఘటనలో మృతి చెందాడు. ఈ మధ్యకాలంలోనే రాములు ఉన్న పొలాన్ని అమ్మి, ఇల్లు కట్టుకున్నాడు. కూతురు పెళ్లిని ఘనంగా చేయాలని అనుకున్నాడు. అంతలోనే మృత్యువు రూపంలో వచ్చిన లారీ వారి కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. తండ్రి లేడు అన్న విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంటి పెద్ద దిక్కు లేకపోవడంతో ఆ కుటుంబం భవిష్యత్తు ఇప్పుడు వర్ణనాతీతంగా మారింది. తన తండ్రి లేని బ్రతుకు తమకు వద్దని కన్నీరు మున్నేరుగా వినిపిస్తున్నారు రాములు కుటుంబ సభ్యులు.

అదే గ్రామానికి చెందిన కృష్ణా అనే యువకుడు, తన తల్లి తండ్రి అన్నదమ్ములతో కలిసి పొలం పనులకు వెళ్లారు. ఆ తర్వాత టమాటాల బాక్సులు తెచ్చేందుకు రోడ్డు మీదకు రాగా, లారీ ఒక్కసారిగా దూసుకువచ్చింది. దీంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇప్పుడే వస్తానని చెప్పిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఇటీవల కాలంలోనే కృష్ణ రైల్వే జాబ్స్ పరీక్షలు రాశాడు. చాలా బాగా రాశానని అతని సోదరి అరుణతో చెప్పుకున్నాడు. కానీ అంతలోపే కృష్ణ మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇక ఖానాపూర్‌లో నివసిస్తున్న శ్యామల సుజాత రోజులానే కూరగాయలు అమ్మేందుకు వచ్చింది. అంతలోనే మృత్యువులా దూసుకొచ్చిన లారీ వాళ్ల కుటుంబంలో తీరని విషాదాన్ని మిగుల్చింది. శ్యామల సుజాతకు ఒకే ఒక్క కొడుకు డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. తన తల్లి లేదని తెలియడంతో జీర్ణించుకోలేకపోతున్నాడు. మరోవైపు హైదరాబాద్ నుంచి పని కోసం వచ్చిన జమీల్ అనే యువకుడు ఈ లారీ ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విధంగా నాలుగు కుటుంబాలలో ఒక్కొక్కరిని కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం అతివేగంతో పాటు సింగిల్ రోడ్ ఉండడంతో ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరగడం, వాహనాలు ఓవర్టేక్ చేయడం ప్రధాన సమస్య అని స్థానికులు చెబుతున్నారు. తరచూ ఇక్కడ రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయని ఖచ్చితంగా రోడ్డును వెడల్పు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..