కార్మికురాలిని గొలుసులతో కట్టేసి, వివస్త్రను చేసేందుకు ప్రయత్నించిన రౌడీ రాణీ..!

వరంగల్‌లోని పేదల పెద్దాసుపత్రి ఎంజీఎం ఆవరణలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రౌడీ రాణీ, మాజీ యూనియన్ లీడర్ రెచ్చిపోయింది. మామూళ్ల కోసం అమానవీయంగా ప్రవర్తించింది.

కార్మికురాలిని గొలుసులతో కట్టేసి, వివస్త్రను చేసేందుకు ప్రయత్నించిన రౌడీ రాణీ..!
Mgm Hospital Harasment
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 10, 2024 | 4:52 PM

వరంగల్‌లోని పేదల పెద్దాసుపత్రి ఎంజీఎం ఆవరణలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రౌడీ రాణీ, మాజీ యూనియన్ లీడర్ రెచ్చిపోయింది. మామూళ్ల కోసం అమానవీయంగా ప్రవర్తించింది. అంతా చూస్తుండగానే బరితెగించి, ఓ ఔట్ సోర్సింగ్ కార్మికురాలిని గొలుసులతో కొట్టి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించింది. ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఆ ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయ లాంటిది వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి. నిత్యం వందలాది మంది పేషెంట్లు, వాళ్ళ అటెండెన్స్ తో రద్దీగా ఉండే ఈ పేదల పెద్దాసుపత్రిలో కొంతమంది రాబందులు తిష్ట వేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో అమాయకులను రాబందుల్లా పీక్కు తింటున్నారు.. తాజాగా జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం..

రాజమ్మ అనే ఒక మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నాయకురాలు రౌడీ రాణీలా రెచ్చిపోయింది.. ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. ఉద్యోగం పెట్టిస్తే, నెల మామూళ్ళు ఇవ్వలేదని సుమలత అనే ఔట్ సోర్సింగ్ కార్మికురాలిపై అత్యంత దారుణంగా ప్రవర్తించింది. సెక్యూరిటీ సిబ్బందితోపాటు అక్కడ అంతా చూస్తుండగానే ఆమెపై విచక్షణారహితంగా గొలుసులతో దాడిచేసి అదే గొలుసు కట్టేసింది. గొలుసు తెంచుకున్న ఆమెను విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచింది. ఎంజీఎం సెక్యూరిటీ సిబ్బంది ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఆ అబాగ్యురాలిని వివస్త్రను చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె బోరున విలపించచడంతో స్థానికులు ఆమెకు విముక్తి కల్పించారు.

వీడియో చూడండి..

అయితే రౌడీ రాణీ రాజమ్మ ఇలాంటి బరితెగింపు వేషాలు ఇదే ప్రథమం కాదంటున్నారు స్థానికులు. గతంలో ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్ కార్మికుల యూనియన్ నాయకురాలుగా పనిచేసిన రాజమ్మ, అందరిపై కర్ర పెత్తనం చేసేదని ఎంజీఎం సిబ్బంది చెబుతున్నారు. ఉద్యోగాల పేరుతో చాలామంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ దృష్టికి రావడంతో గతంలో ఆమెను విధుల్లో నుంచి తొలగించారు. ఆయన బదిలీ అయిన తర్వాత రాజమ్మ మళ్లీ ఎంజీఎం తిష్ట వేసింది. మళ్లీ తన రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ ఇలాంటి బరితెగింపు దాడులకు పాల్పడుతోందని ఎంజీఎం ఔట్ సోర్సింగ్ సిబ్బంది చెబుతున్నారు.

ఇదిలావుండగా, రౌడీ రాణీ రాజమ్మ దాడిలో గాయపడిన బాధితురాలు సుమలత మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. పైశాచికంగా దాడికి పాల్పడిన రాజమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని… ఆమె పూర్వపు కేసులు హిస్టరీని తీసుకొని, అవసరమైతే ఆమెపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..