Telangana: హరిణికి ఏమైంది..? ఇంటికొచ్చిన తెల్లారే గుండెల్ని పిండేసే ఘోరం..
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం.. కూలి పనులు చేస్తూ కూతురిని గొప్పగా చదివించాలనుకున్న ఓ కన్నతల్లి ఆశలు క్షణాల్లో కరిగిపోయాయి. సెలవులకని ఇంటికొచ్చిన నర్సింగ్ విద్యార్థిని హరిణి మృత్యువాత పడటం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. మృతదేహంపై కనిపించిన గాయాలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కష్టపడి చదివించి నర్సుగా చూడాలనుకున్న తల్లి ఆశలు ఆవిరయ్యాయి. సెలవులకు ఇంటికి వచ్చిన నర్సింగ్ విద్యార్థిని ఒక్కరోజులోనే అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన దివంగత సతీష్, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. భర్త మరణించడంతో రాజేశ్వరి కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను కష్టపడి పోషిస్తోంది. పెద్ద కూతురు ఇంద్రవెల్లి హరిణి (18) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ ఫస్టీయర్చదువుతోంది. కాలేజీకి సెలవులు రావడంతో కొన్ని రోజుల క్రితం కొత్తగూడెంలోని తన పిన్ని ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి నిన్ననే స్వగ్రామమైన వెంగన్నపాలెంలోని తల్లి వద్దకు చేరుకుంది.
నిర్జీవంగా పడి ఉన్న కూతురు..
తల్లి రాజేశ్వరి అదే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి, తిరిగి వచ్చేసరికి ఇంట్లో హరిణి కనిపించలేదు. ఆందోళనతో చుట్టుపక్కల వెతకగా, ఇంటి బాత్‌రూమ్ పక్కన హరిణి నిర్జీవంగా పడి ఉండటం కనిపించింది. కన్న కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లి ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించింది. హరిణి మృతదేహంపై గాయాలు ఉండటం, ఒంటిపై దుస్తులు చిందరవందరగా పడి ఉండటంతో ఆమె మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా ఆమెపై దాడి చేశారా? లేక మరేదైనా రిగిందా? అనే కోణంలో గ్రామస్తులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం
సమాచారం అందుకున్న వెంటనే జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైమ్ సీన్‌ను పరిశీలించి, క్లూస్ టీం సహాయంతో కీలక ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. చేతికందివచ్చిన కూతురు అర్థాంతరంగా తనువు చాలించడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
