Telangana: లచ్చిందేవిని వెంట తెచ్చిన కూతురు.. రూ. 500కే రూ. 16 లక్షల ప్లాట్ గెలిచిందిగా
అందరూ ఆడపిల్లను ఇంటికి మహాలక్ష్మి అని అంటారు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనే.. ఆ ఇంటికి మమతాను రాగాలతో పాటు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకువస్తారని నమ్మకం. ఆడపిల్లలు..ఇంటికి వెలుగును, అదృష్టాన్ని తెస్తారని భావిస్తుంటారు. అలాంటి అదృష్టాన్నీ ఓ చిన్నారి తీసుకువచ్చింది. ఆ చిన్నారి తీసుకువచ్చిన లక్కీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన రాంబ్రహ్మం.. తనకున్న రేకుల గదితో సహా 66 గజాల స్థలాన్ని అమ్మే ప్రయత్నం చేశాడు. ఏడాదిగా విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వినూత్నంగా స్థల విక్రయానికి ప్లాన్ చేశాడు. స్థలం కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారు రూ.500 విలువైన కూపన్ ను కొనుగోలు చేసి లక్కీడ్రాలో పాల్గొనాలని జాతీయ రహదారి పక్కన ఫ్లెక్సీలు కట్టారు. దీంతో చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కూపన్లను కొనుగోలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో హోటల్‌లో పనిచేసే శంకర్ సొంతింటి సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో చౌటుప్పల్ లక్కీ కూపన్ విషయం తెలుసుకున్నాడు. దీంతో తనతో పాటు భార్య ప్రశాంతి, కుమార్తెలు సాయి రిషిక, హన్సికల పేరుతో నాలుగు కూపన్లు కొనుగోలు చేశాడు. ఇచ్చిన మాట మేరకు రాంబ్రహ్మం ఆదివారం చౌటుప్పల్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో 300 మంది సమక్షంలో లక్కీ డ్రా తీశాడు. 3600 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కూపన్లను కొనుగోలు చేశారు. ఇందులో పది నెలల చిన్నారి హన్సికను లక్కీడ్రా వరించింది. లక్కీడ్రా తర్వాత చిన్నారి హన్సికను విజేతగా ప్రకటించారు.
దీంతో లక్కీ డ్రాలో రూ.16 లక్షల విలువైన ఇంటిని రూ.500లకే సొంతం చేసుకుంది. చిన్నారి తండ్రి శంకర్‌కు రాంబ్రహ్మం ఫోన్ చేసి సమాచారాన్ని అందించాడు. దీంతో శంకర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. స్థానిక మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం, గది విలువ రూ.16 లక్షలు ఉంటుందని.. త్వరలోనే ఇంటిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని రాంబ్రహ్మం తెలిపాడు. తన భార్య ప్రశాంతి, కూతుళ్లు సాయి రిషిక, హన్సికల పేరుతో నాలుగు కూపన్లు కొనుగోలు చేశానని.. అందులో హన్సికను అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందని శంకర్ చెబుతున్నాడు. తన కూతుర్లే తన ఇంటి మహాలక్ష్మిలని.. వారే తన ఇంటి దేవతలని అంటున్నాడు. వారితోనే తన అదృష్టమని శంకర్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
