ChatGPT: ఏఐ మాయ.. చాట్‌జీపీటీ వాడి రూ. 10 లక్షల అప్పు తీర్చిన మహిళ
అమెరికాకు చెందిన జెన్నిఫర్ అలెన్ అనే మహిళ, చాట్‌జీపీటీ సాయంతో తన క్రెడిట్ కార్డు అప్పు రూ.20 లక్షల (దాదాపు 23,000 డాలర్లు) లో దాదాపు సగం తీర్చేసింది. డెలావేర్‌లో రియల్టర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల అలెన్, మంచి సంపాదన ఉన్నప్పటికీ పెరిగిన ఖర్చులతో ఇబ్బంది పడేవారు. ఆర్థిక అక్షరాస్యత నేర్పకపోవడం దీనికి కారణం అంటారు. ఆమె బిడ్డ పుట్టాక వైద్య ఖర్చులు, కొత్తగా తల్లిదండ్రులైన ఖర్చులు పెరిగి క్రెడిట్ కార్డులపై ఆధారపడటం ఎక్కువైంది. ‘‘విలాసవంతంగా జీవించకపోయినా రోజూవారి ఖర్చులు, నెలవారీ బిల్లులకే సంపాదనంతా ఆవిరైపోయేది. దీంతో మా గమనించకుండానే అప్పు పేరుకుపోయింద’’ అని వివరించారు.

ఆర్థిక పరిస్థితిని మార్చుకోవాలని నిర్ణయించుకున్న అలెన్, చాట్‌జీపీటీని ఆశ్రయించి 30 రోజుల వ్యక్తిగత ఆర్థిక సవాలును ప్రారంభించారు. ప్రతిరోజూ, అప్పు తగ్గించుకోవడానికి ఒక ప్లాన్ ను సూచించమని ఆమె ఏఐ టూల్‌ను అడిగారు. సైడ్ హస్టిల్స్ గురించి ఆలోచించడం, వాడని సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేయడం, మరచిపోయిన ఖాతాల్లోని వాడని నిధులను గుర్తించడం వంటి పనులు ఈ ఏఐ టూల్ కి పురమాయించింది.
ఏఐ పనిచేసింది..
ఏఐ ఇచ్చిన సూచనలు చాలా సులభంగా, ప్రభావవంతంగా ఉన్నాయి. ఒక రోజు, ఆర్థిక యాప్‌లు, బ్యాంక్ ఖాతాలను పరిశీలించమని చాట్‌జీపీటీ సూచించింది. అలా పరిశీలించగా, ఇన్ యాక్టివ్ లో ఉన్న బ్రోకరేజ్ ఖాతాతో సహా $10,000 (సుమారు రూ. 8.5 లక్షలు)కు పైగా అన్‌క్లెయిమ్డ్ డబ్బును అలెన్ కనుగొన్నారు. మరో రోజు,ఇంట్లో ఉన్న వస్తువులతో మాత్రమే వంట చేయడానికి ఒక మీల్ ప్లాన్ తయారు చేసుకోమని సూచించగా, ఆమె నెలవారీ కిరాణా బిల్లును దాదాపు రూ. 50,000 తగ్గించుకున్నారు.
సగం అప్పు చెల్లింపు, మిగతాది కూడా
ఈ 30 రోజుల సవాలు ముగిసేసరికి, అలెన్ మొత్తం అప్పులో దాదాపు సగం, అంటే $12,078.93 (సుమారు రూ. 10.3 లక్షలు) చెల్లించారు. మిగిలిన అప్పును కూడా తొలగించడానికి అలెన్ ఇప్పుడు రెండోసారి 30 రోజుల చాలెంజ్ ను ప్రారంభించాలని ఆలోచిస్తోంది. “ఇదొక గొప్ప హ్యాక్ ఏమీ కాదు” అని ఆమె అన్నారు. “ప్రతిరోజు దానిని ఎదుర్కోవడం, ట్రాక్ చేయడం, దాని గురించి మాట్లాడటం, దానిని చూడటం వల్లనే ఇది సాధ్యమైంది. నా ఆర్థిక సమస్యలకు భయపడటం మానేశాను” అని వివరించారు.
పెరుగుతున్న అప్పులు: అలెన్ స్ఫూర్తి
అమెరికాలో వ్యక్తిగత అప్పులు పెరుగుతున్న సమయంలో అలెన్ కథ బయటపడింది. 2025 మొదటి త్రైమాసికంలో గృహ రుణాల మొత్తం $18.2 ట్రిలియన్‌లకు చేరుకుందని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఇలాంటి సవాళ్లతో పోరాడుతున్న ఇతరులకు ఆమె సందేశం ఇది.. ‘‘సిద్ధంగా ఉన్నారని లేదా తెలివైనవారని భావించే వరకు వేచి ఉండకండి.’’